హల్ది వాగుకూ జీవం..

6 Apr, 2021 03:32 IST|Sakshi

కొండపోచమ్మ సాగర్‌ నుంచి వాగులోకి గోదావరి జలాలు

నేడు విడుదల చేయనున్న సీఎం

పదిరోజుల్లో మంజీరా మీదుగా నిజాంసాగర్‌కు నీళ్లు

98 కిలోమీటర్ల దూరం 32 చెక్‌డ్యాంల్లో నీటి నిల్వ

14,268 ఎకరాల వరి పంటకు జలాలు.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: సమృద్ధిగా వర్షాలు పడితేగానీ నిండుగా నీరు కనిపించని హల్దివాగు దశ, దిశ మారుతోంది. కాలంతో పనిలేకుండా రైతులకు నీళ్లు అందేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండపోచమ్మ సాగర్‌ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్ది వాగులోకి.. అక్కడి నుంచి మంజీరా మీదుగా నిజాంసాగర్‌లోకి గోదావరి జలాలను తరలించనున్నారు. సీఎం కేసీఆర్‌ మంగళవారం ఉదయం 10.30 గంటలకు నీటి విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం పరిశీలించారు.

కొండపోచమ్మ టు నిజాంసాగర్‌
కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా 6.12 కిలోమీటర్‌ వద్ద నుంచి హల్దివాగులోకి గోదావరి జలాలను వదిలే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత ఈ కాల్వ నుంచి వర్గల్‌ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి నీటిని వదులుతారు. అక్కడి నుంచి మత్తడి దూకుతూ గొలుసుకట్టు చెరువులైన వర్గల్‌ పెద్దచెరువు, శాకారం ధర్మాయిచెరువు, అంబర్‌పేట కాని చెరువులు నిండి నాచారం మీదుగా హల్దివాగుకు గోదావరి జలాలు చేరుతాయి. మొత్తం 98 కిలోమీటర్ల పొడవుండే ఈ వాగు మెదక్‌ జిల్లా తుప్రాన్‌ మండలం యావపూర్, నాగులపల్లి మీదుగా కామారెడ్డి జిల్లాలో మంజీరానదిలో కలుస్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నస్రుల్లాబాద్, నిజామాబాద్‌ జిల్లా బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు మొదలైన ప్రాంతాల రైతులకు చెందిన 14,268 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 20వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందించేందుకు దోహదపడనుంది.

పదిరోజుల్లో నిజాంసాగర్‌కు..
మంగళవారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా విడుదల చేసే గోదావరి జలాలు హల్దివాగును దాటుకుంటూ పది రోజుల్లో నిజాంసాగర్‌కు చేరుకోనున్నాయి. కొండపోచమ్మ సాగర్‌ నుంచి రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగులోకి ప్రవేశించే జలాలు.. వాగుపై ఉన్న 32 చెక్‌ డ్యామ్‌లను నింపుకొంటూ పది రోజుల్లో నిజాంసాగర్‌లోకి చేరుతాయి.

ఏర్పాట్లన్నీ సిద్ధం
సీఎం కేసీఆర్‌ మంగళవారం గోదావరి జలాలను హల్దివాగులోకి విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు వర్గల్‌ మండలం అవుసులోనిపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్ది వాగు కాల్వలోకి నీటిని విడుదల చేస్తారు. తర్వాత 11.15 గంటలకు మర్కూక్‌ మండలంలోని పాములపర్తిలో గోదావరి జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు, బందోబస్తును మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు.

చదవండి: హాట్‌హాట్‌గా ఓటు వేట

మరిన్ని వార్తలు