యాసంగిలో 50 లక్షల ఎకరాల్లో వరి 

16 Oct, 2020 01:57 IST|Sakshi
గురువారం ప్రగతి భవన్‌లో యాసంగి పంటలపై అధికారులతో సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్‌

15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు

సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: యాసంగిలో 50 లక్షల ఎకరాల్లో వరి, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రైతులకు సూచించారు. జిల్లాలు, మండలాలు, క్లస్టర్లవారీగా ఏ ఏ పంటలు వేయాలనే విషయంలో వ్యవసాయ అధికారులు స్థానికంగా రైతులకు సూచనలు చేయాలని కోరారు. ఈ వానాకాలంలో ప్రభుత్వం సూచించిన మేరకు 100 శాతం నిర్ణీత పద్ధతిలోనే రైతులు పంటలను సాగు చేశారని, ఇదే ఒరవడిని యాసంగిలోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటలసాగు విధానంపై సీఎం కేసీఆర్‌ గురువారం ఇక్కడి ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్లస్టర్లు, మండలాలు, జిల్లాలవారీగా యాసంగి పంటల సాగుపై అంచనాలు రూపొందించారు.

వీటిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి, ఏ పంట ఎంత మేరకు సాగు చేయాలనే విషయంలో తుదినిర్ణయం తీసుకున్నారు. శనగ 4.5 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 4 లక్షలు, మిరపతోపాటు ఇతర కూరగాయలు లక్షన్నర నుంచి రెండు లక్షలు, జొన్న లక్ష, నువ్వులు లక్ష, పెసర 50 నుంచి 60 వేలు, మినుములు 50 వేలు, పొద్దు తిరుగుడు 30–40 వేలు, ఆవాలు–కుసుమలు–సజ్జలు లాంటి పంటలు మరో 60 నుంచి 70 వేల ఎకరాల చొప్పున సాగు చేయాలని నిర్ణయించారు. ఈ పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచినట్లు సీఎం వెల్లడించారు. వ్యవసాయాధికారులు సూచించిన మేరకు రైతులు పంటలు సాగు చేయాలని, తద్వారా మంచి ధర పొందాలని సూచించారు. నిర్ణీత పంటల సాగు విధానం నిరంతర ప్రక్రియగా సాగాలని సీఎం చెప్పారు.  నిర్ణీత పంటల సాగు విధానం అమలు చేసిన ఫలితంగా పత్తి సాగులో మనరాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో నిలవడం గమనార్హం.

పంటల కార్డులు
క్లస్టర్లు, మండలాలు, జిల్లాలవారీగా పంటల సాగు లెక్కలతో కార్డులు తయారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఒక సీజన్‌లో విత్తనాలు వేయడం ముగియగానే, వ్యవసాయ శాఖ మరో సీజన్‌లో ఏ ఏ పంటలు వేయాలనే విషయంపై కార్యాచరణ ప్రారంభించాలని నిర్దేశించారు. ఈ విషయంలో రైతు సమన్వయ సమితులు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ దసరా నాటికి చాలావరకు రైతువేదికల నిర్మాణం పూర్తవుతుందని, వాటి ద్వారా రైతులను సంఘటితపరచడం, సమన్వయం చేయడం సులభమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘ఏ కొత్త విధానమైనా, ఎవరికైనా ఒక్క రోజుతో, ఒక్క ప్రయత్నంతో అలవాటు కాదు. నిరంతర ప్రక్రియ ద్వారా మాత్రమే అలవడుతుంది. రైతులకు కూడా, వారికి లాభం కలుగుతుందనే విషయాన్ని ఒకటికి నాలుగుసార్లు అర్థం చేయిస్తే అవగాహన, చైతన్యం పెరుగుతాయి’ అని సీఎం చెప్పారు. మక్కల సాగు వద్దనేదే ప్రభుత్వ సూచన అనీ, అయినప్పటికీ ఎవరైనా రైతులు మక్కలు సాగు చేయాలని భావిస్తే అది వారి రిస్క్‌ అని స్పష్టం చేశారు. ఎంత ధర వస్తే అంతకే అమ్ముకుంటామనుకునే రైతులే మక్కలు పండించుకోవాలన్నారు. మక్కలకు రూ.900 మించి ధర వచ్చే అవకాశం లేదని అంచనా వేశారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు