ఏ వర్గాన్నీ విస్మరించలేదు: సీఎం కేసీఆర్‌

14 Sep, 2021 01:43 IST|Sakshi

దళితులనే అభివృద్ధి చేస్తున్నారనే చర్చ దుష్ప్రచారమే

దళిత బంధు సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్‌  

అగ్రకులాల్లోని పేదల అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతున్నాం

దళితులను బాగు చేసుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉంది

ఆ నాలుగు మండలాలకు రెండు మూడువారాల్లో దళిత బంధు నిధులు

సాక్షి, హైదరాబాద్‌: దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృద్ధి చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ కేవలం దుష్ప్రచారమేననని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క కులాన్నీ, మతాన్నీ, వర్గాన్నీ విస్మరించ లేదని, నిర్లక్ష్యం చేయలేదని.. బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాల్లోని పేదలను గుర్తించి వారిని అభివృద్ధి పరిచే కార్యక్రమాలను అమలు పరు స్తున్నామని చెప్పారు. రాష్ట్రం నలుదిక్కుల్లో ఉన్న చింతకాని, తిర్మలగిరి, చార గొండ, నిజాం సాగర్‌ మండలాల్లో దళితబంధు పథకం పైలట్‌ ప్రాజెక్టు అమలుపై సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నాలుగు మండ లాల్లో దళిత బంధు అమలుకు దశల వారీగా 2,3 వారాల్లోగా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఈ మండలాల అధికా రులు గ్రామాలకు తరలాలని ఆదేశించారు.     

ఇప్పటివరకు అరకొరగానే
‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా వివక్ష, ఆర్తి, బాధతో వున్న వర్గం ఏదైనా ఉందంటే అది దళిత జాతేననే విషయాన్ని అనేక జాతీయ, అంతర్జాతీయ తులనాత్మక అధ్యయనాలు స్పష్టం చేశాయి. స్వాతంత్య్రానంతరం అరకొర అభి వృద్ధి తప్పితే, దళిత గూడాల్లో గుణాత్మకమైన మార్పు రాలేదు. ఒక కుటుంబంలో ఎవరిౖకైనా ఆపద వస్తే ఎలాగైతే ఆదుకుంటామో అదే స్ఫూర్తితో దళితులను బాగు చేసుకోవాల్సిన బాధ్యత యావత్‌ సమాజంపై ఉంది. దశల వారీగా  రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించుకుని  పథకాన్ని అమలు చేస్తాం. 

తల్లిదండ్రుల మాదిరి వ్యవహరించాలి
దళితుల అభ్యున్నతికి అధికారులు తల్లిదండ్రుల మాదిరి (పేరంటల్‌ అప్రోచ్‌) పనిచేయాలి. అధికార దర్పంతో కాకుండా. తమ కన్నబిడ్డ ఆలనా పాలనా తల్లిదండ్రులు ఎలాగైతే చూస్తారో ఆ పద్ధతిలో దళితులతో వ్యవహరించాలి. సమన్వయకర్తల్లాగా కలిసి పనిచేయాలి. దళితుల్లో ఒక విశ్వాసాన్ని పాదుకొల్పాలి. దళితుబంధు పథకాన్ని తమ భుజాల మీద మోయాల్సిన సమయం విద్యావంతులైన దళిత యువతకు ఆసన్నమయ్యింది. దళిత యువతను అధికారులు ఈ పథకంలో భాగస్వాములను చేయాలి..’ అని సీఎం చెప్పారు.  

వ్యాపార, ఉపాధి రంగాల్లో దళితులకు కోటా  
‘ప్రభుత్వం లైసెన్సులు కేటాయించే వివిధ రంగాలను గుర్తించి అందులో అర్హులైన దళితులకు రిజర్వేషన్‌ ఏర్పాటు చేస్తాం. మెడికల్‌ షాపులు, ఫర్టిలైజర్‌ షాపులు, మీసేవా కేంద్రాలు, గ్యాస్‌ డీలర్‌షిప్పులు, ట్రాన్స్‌పోర్టు పర్మిట్స్, మైనింగ్‌ లీజులు, సివిల్‌ కాంట్రాక్టులు, అవుట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టులు, బార్లు.. వైన్‌ షాపులు తదితరాల ద్వారా ఉపాధి పొందే విధంగా, దళితబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అన్ని విధాలుగా దళిత కుటుంబం బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’ అని స్పష్టం చేశారు.
 
దళితబంధు ప్రత్యేక ఖాతా
‘ప్రతి లబ్ధిదారుని కుటుంబానికి ప్రత్యేకంగా దళితబంధు బ్యాంక్‌ ఖాతా తెరిపిస్తాం. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో దళితబంధు కమిటీలు ఉంటాయి. ఈ కమిటీల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా దళిత బిడ్డలు.. దళిత జాతి  సంరక్షణను తమ భుజాలమీద వేసుకొని నిర్వహించనున్నారు. ఈ కమిటీల నుంచి ఎన్నికైన వారే రీసోర్స్‌ పర్సన్లుగా పనిచేస్తారు..’ అని సీఎం తెలిపారు. దళితబంధులో డెయిరీ యూనిట్లను ప్రోత్సహించడానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్‌ కుమార్,  జి.జగదీష్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వి.శ్రీనివాస్‌ గౌడ్, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, గువ్వల బాలరాజు, జైపాల్‌ యాదవ్, భట్టి విక్రమార్క, హనుమంతు షిండే,  ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు  
 రాజకీయాలకు అతీతంగా నా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
– మల్లు భట్టి విక్రమార్క 

ఇంత మంచి పథకం ఎవరూ పెట్టలేదు : 
దళితుల అభ్యున్నతికి ఇంత మంచి పథకాన్ని ఎవరూ పెట్టలేదు.  ఒక చరితార్థుడే ఇలాంటివి చేయగలుగుతాడు. ఆయనే సీఎం కేసీఆర్‌.
– మోత్కుపల్లి నర్సింహులు

‘‘పాతిన వెలిశిల పాదులో ప్రగతి లిపి మొలిసింది నరకబడ్డ చెట్ల వేర్లు నడక నేర్చుకుంటున్నవి ఏ జాతుల జ్ఞానంతో భరత జాతి వెలిగిందో  ఏ చేతుల సలువ వల్ల ధరణి మైల తొలగిందో ఆ వెలివాడల త్యాగాలకు ప్రతిరూపం అంబేడ్కర్‌ మలి వేకువ యాగానికి శ్రీకారం కేసీఆర్‌ ’’ అంటూ గోరటి వెంకన్న కవితాత్మకంగా స్పందించారు. 

దళిత గిరిజన బంధుగా మార్చండి: భట్టి
ఈ సందర్భంగా దళితబంధు పథకం అమలుపై కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయాన్ని వివరిస్తూ.. కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఒక లేఖను సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. ‘రాష్ట్రంలోని ఈ వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికీ పథకాన్ని వర్తింపజేస్తామని మీరు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని దళిత కుటుంబాలకు పథకాన్ని అమలు చేయాలి. అలాగే గిరిజన బంధు పథకాన్ని ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి. పేదరికంలో ఉన్న ఇతర వర్గాల వారికి కూడా వర్తింప చేయాలి.  దళిత బంధు పథకాన్ని దళిత – గిరిజన బంధుగా మార్చి తక్షణం రాష్ట్రంలోని ప్రతి దళిత – గిరిజన కుటుంబానికి అమలు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది..’ అని లేఖలో తెలిపారు. దళితబంధు ఉత్తుత్తి పథకంగా మిగిలి పోకూడదని పేర్కొన్నారు. 

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను భట్టి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి విడిగా వినతిపత్రం అందజేశారు. 

మరిన్ని వార్తలు