ఆ రెండు జిల్లాల అభివృద్దికి కొత్త ప్రాజెక్ట్‌: సీఎం కేసీఆర్‌

3 Apr, 2021 01:06 IST|Sakshi
శుక్రవారం ప్రగతి భవన్‌లో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో సబిత, మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలపై దృష్టి.. సీఎస్‌ నేతృత్వంలో నోడల్‌ ఏజెన్సీ 

మార్కెట్ల నిర్మాణం.. రోడ్లు, తాగునీటి సమస్యలకు పరిష్కారం 

సమగ్ర ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని ఆదేశం 

ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి , మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల సమీకృతాభివృద్ధి, సమస్యలకు శాశ్వత పరిష్కారం, ఏకీకృత విధానం ఏర్పాటు కోసం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధ్యక్షతన నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, ముఖ్య పట్టణాల్లో.. సమీకృత వెజ్, నాన్‌ వెజ్‌ మార్కెట్లు, రోడ్లు, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక వసతుల అభివృద్ధి, డ్రైనేజీ, నాలాల మరమ్మతులు వంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనిపై సీఎం శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘హైదరాబాద్‌ కాస్మోపాలిటన్‌ నగరంగా పురోగమిస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయాలి. హైదరాబాద్‌తోపాటు సమ్మిళిత అభివృద్ధిని కొనసాగించేలా సమీకృత విధానాన్ని రూపొందించాలి. ఇందుకు నిరంతర పర్యవేక్షణ కోసం సీఎస్‌ అధ్యక్షతననోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేద్దాం’’ అని కేసీఆర్‌ చెప్పారు. 

ప్రణాళికలు సిద్ధం చేయండి 
రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ప్రజలకు విద్య, వైద్యం వంటి అన్ని సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తేవాలని  కేసీఆర్‌ అన్నారు. ‘‘ఏ నియోజకవర్గం పరిధిలో ఏ సమస్యలున్నాయనే దానిని ఒక ప్రాజెక్టు రూపంలో స్థానిక ఎమ్మెల్యేలు రూపొందించాలి. మౌలిక వసతుల అభివృద్ధికి ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రణాళికలను సిద్ధం చేయాలి. నోడల్‌ అధికారి అధ్యక్షతన తరచూ సమావేశం కావాలి. అందులో ఏయే శాఖల భాగస్వామ్యం ఉండాలి, ఖర్చు ఎంతవుతుందన్న అంశాన్నింటినీ ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి చర్చించాలి. నెలకోసారి ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సీఎస్‌ క్రమం తప్పకుండా సమావేశం కావాలి. నోడల్‌ అధికారి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలి. సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉంది’’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

హైదరాబాద్‌లో అద్భుతమైన వాతావరణం 
హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ విమానాశ్రయం, అద్భుతమైన వాతావరణ పరిస్థితులున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. మిషన్‌ భగీరథ తాగునీరు నిరంతరం అందుతోందని, నీటి అవసరాల కోసం అతిపెద్ద రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. ‘‘ఈ రెండు జిల్లాల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలి. సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయాలి. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, రోడ్ల నిర్మాణం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, వరదల ముంపు రాకుండా చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ, భూరిజిస్ట్రేషన్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను అన్వేషించాలి. తద్వారా ఈ రెండు జిల్లాలు భవిష్యత్తులో హైదరాబాద్‌ తో పోటీ పడాలి..’’ అని కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. 

నిధుల సమీకరణపై దృష్టి 
సమగ్రాభివృద్ధికి సంబంధించి నిధుల సమీకరణపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. నోడల్‌ ఏజెన్సీ ఏర్పాటుతో హైదరాబాద్‌ నలువైపులా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి వీలవుతుందన్నారు. అన్ని దిక్కుల్లో అన్ని రకాల పనులు సమాంతరంగా కొనసాగేలా చూడాలన్నారు. సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, నవీన్‌రావు, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి, బేతి సుభాష్‌ రెడ్డి, అరికెపూడి గాంధీ, కె.పి వివేకానంద, కాలె యాదయ్య, మాధవరం కృష్ణారావు, అధికారులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు