TS: గంజాయిపై జంగ్‌: కేసీఆర్‌

21 Oct, 2021 05:05 IST|Sakshi

సాగు చేస్తే రైతుబంధు, రైతు బీమా రద్దు  

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌లో సాగు చేస్తే పట్టాలు కూడా..

సీఎం కేసీఆర్‌ హెచ్చరిక

రాష్ట్రంలో పరిస్థితి అదుపు తప్పకముందే తీవ్ర యుద్ధం ప్రకటించండి

పోలీస్, ఎక్సైజ్‌ అధికారులకు ఆదేశం 

ఒక్క మొక్క కూడా కన్పించకూడదు

డ్రగ్స్‌ నిరోధానికి డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్

ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను బలోపేతం చేయాలి

సరిహద్దుల్లో చెక్‌పోస్టులు పెంచండి.. విద్యాసంస్థల వద్ద నిఘా వేయండి

గంజాయి ఉత్పత్తిని నిరోధించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయండి

రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు పోలీస్, ఎక్సైజ్‌ అధికారులకు ఏం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గంజాయి మాఫియాను అణచివేయండి. నేరస్తులు ఎంతటి వారైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. గుడుంబా తాగడం వల్ల భర్తలను కోల్పోయి ముక్కు పచ్చలారని గిరిజన యువతులు వితంతువులుగా మారుతుండటం నా హృదయాన్ని కలచివేస్తోంది. అందుకే రాష్ట్రంలో గుడుంబా నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాం.– సీఎం కేసీఆర్‌

సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అభివృద్ధి దిశగా అనేక లక్ష్యాలను పూర్తి చేసుకున్నాం. గంజాయి పీడను త్వరగా తొలగించకపోతే రాష్ట్రం సాధిస్తోన్న ప్రగతి ఫలితాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. గంజాయి కోసం గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్‌ మెసేజ్‌లు పెట్టుకుని తెప్పించుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 
– సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గంజాయి సాగు చేస్తున్న వారికి రైతుబంధు, రైతు బీమా రద్దు చేయడంతోపాటు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూముల్లో సాగు చేసే వారి పట్టాలను కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలి స్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరిం చారు. రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క కూడా కని పించకూడదని స్పష్టం చేశారు. గంజాయి విని యోగం పెరుగుతోందని నివేదికలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి అదుపుతప్పక ముందే తీవ్ర యుద్ధం ప్రకటించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

గంజాయిని నిరోధించేందుకు డీజీ స్థాయి పోలీసు అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాని ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరోధంపై బుధవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పోలీస్, ఎక్సైజ్‌ ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

హోం, ఎక్సైజ్‌ శాఖ మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, హోంశాఖ సలహాదారు అనురాగ్‌శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శులు స్మితా సభర్వాల్, శేషాద్రి, రాహుల్‌ బొజ్జా, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌లతో పాటు పోలీసు, ఎక్సైజ్‌ శాఖల ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.


మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం
‘రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగాం. ఈ విజయం వెనుక పోలీస్‌ శాఖ త్యాగాలున్నాయి. వారు చేసిన వీరోచిత పోరాటం ఉంది. దీంతో రాష్ట్ర గౌరవ, ప్రతిష్టలు ఎంతగానో పెరిగాయి. రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం. వ్యవసాయంలో వచ్చిన అభివృద్ధి కారణంగా రాష్ట్రంలో కోటీ 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. పంజాబ్‌ రాష్ట్రాన్ని కూడా మించిపోతున్నాం. మిషన్‌ భగీరథ ద్వారా అటవీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు కూడా పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నాం.

విద్యుత్‌ రంగంలో అపూర్వ విజయం సాధించాం. ఉద్యమ ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చుకుంటూ ముందడుగులు వేస్తున్నాం. ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రపంచంలోని దిగ్గజ సంస్థల్లో 99 శాతం సంస్థలు మన రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసు శాఖ ప్రదర్శించిన ప్రతిభ, నైపుణ్యం కారణంగానే మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి..’అని ముఖ్యమంత్రి చెప్పారు. 

ఎంతో ఆవేదనతో ఈ సమావేశం పెట్టా..
‘ఈ నేపథ్యంలో నేను ఎంతో ఆవేదనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశా. గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల మానసిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. అమాయక యువత తెలిసీ తెలియక దీని బారిన పడుతోంది. మాదకద్రవ్యాల వినియోగాన్ని మాన్పించడం చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. అందువల్ల వీటి వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలి. మత్తు పదార్థాల వినియోగంతో వచ్చే అనర్ధాల గురించి, యువతకు తెలిసేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి.

యువకుల్లో అవగాహన, పరిణతి కలిగించేలా, గొప్ప ప్రభావం చూపించే విధంగా అద్భుతమైన రీతిలో ప్రచార కార్యక్రమాలు కొనసాగాలి. గతంలో ఎయిడ్స్‌ వ్యాధిపై ఉధృత ప్రచారంతోనే ఆ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించగలిగాం. పోలీస్, ఎక్సైజ్‌ శాఖలు సమన్వయంతో పటిష్టమైన వ్యూహం రూపొందించుకొని, గంజాయి, గుడుంబాలను సమూలంగా నిర్మూలించాలి..’అని సీఎం స్పష్టం చేశారు. 

ఫలితాలు సాధించినవారికి రివార్డులు, పదోన్నతులు
‘రాష్ట్రంలో గంజాయిని నిరోధించేందుకు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయండి. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను పూర్తిస్థాయిలో బలోపేతం చేయండి. విద్యాసంస్థల వద్ద పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలి. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలి. సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవడంతో పాటు తగినన్ని వాహనాలను సమకూర్చుకోవాలి. ఇంటెలిజెన్స్‌ విభాగంలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారులకు నగదు రివార్డులు, ప్రత్యేక పదోన్నతులు, ఇతర ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తుంది. దేశంలోని ఏదైనా రాష్ట్రంలో గంజాయిని సమర్థవంతంగా అరికట్టిన అనుభవాలను అధ్యయనం చేయాలి. గంజాయి వాడకందారుల ఆధారంగా సరఫరా చేసేవారిని పట్టుకోవాలి. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేయలేం అని వాటి వ్యాపారస్తులు భయపడేలాగా కఠిన చర్యలకు ఉపక్రమించాలి. చెక్‌ పోస్టులను, నిఘా కేంద్రాలను కేవలం హైవేల మీదనే కాకుండా, అవసరమైన అన్నిచోట్లా ఏర్పాటు చేయాలి. 

సర్పంచ్‌లు సమాచారం ఇవ్వాలి
గంజాయి సాగును, రవాణా, వినియోగాన్ని అరికట్టే విషయంలో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ కీలకంగా వ్యవహరించాలి. చీమ చిటుక్కుమన్నా తెలిసే విధంగా ప్రత్యేకంగా ఆధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాద్‌కు గంజాయి రాకుండా ఆపే విధంగా పటిష్టమైన వ్యూహం అవలంబించాలి. తమ గ్రామాల్లో గంజాయి సాగు అవుతున్నట్లయితే, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సమాచారాన్ని ఎక్సైజ్, పోలీసు శాఖలకు అందించాలి..’అని ముఖ్యమంత్రి సూచించారు.

గుడుంబా అమ్మకందారులకు ప్రత్యామ్నాయ ఉపాధి
‘గుడుంబా, గ్యాంబ్లింగ్‌ కూడా రాష్ట్రంలో మళ్లీ కనిపిస్తున్నాయి. గుడుంబా తయారీ మళ్లీ మొదలవుతున్నట్లు వస్తున్న సమాచారాన్ని బట్టి ఎక్సైజ్‌ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నిషేధం అమలులో ఏవైనా లోపాలు జరుగుతుంటే వెంటనే సరిదిద్దుకోవాలి. గుడుంబా అమ్మకం మీద ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం కల్పించాలి. ఇందుకు అవసరమైన నిధులను కలెక్టర్లకు విడుదల చేస్తాం. గతంలో పేకాట నిషేధం అమలు చేసిన తీరుపై మహిళల ప్రశంసలు లభించాయి. పేకాట పూర్తిస్థాయిలో ఆగిపోవాలి.

అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నంబర్‌వన్‌గా పేరు తెచ్చుకున్నాం. రాష్ట్ర ప్రతిష్టను కాపాడే విధంగా ఎక్సైజ్, పోలీసు శాఖలు కలిసికట్టుగా, కట్టుదిట్టంగా పనిచేయాలి. ‘తెలంగాణ పోలీస్‌ బెస్ట్‌ పోలీస్‌’అనే పేరును నిలబెట్టుకోండి. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దండి..’అని సీఎం ఆదేశించారు. ప్రస్తుత సమావేశంలో అందిన వివరాల ఆధారంగా త్వరలోనే ముఖ్యమైన అధికారులతో మరొక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అందులో పూర్తిస్థాయి వ్యూహాన్ని ఖరారు చేస్తామని ప్రకటించారు.


గంజాయి విచ్చల విడిగా లభించడంపై  ఇటీవల ‘సాక్షి’ ప్రచురించిన కథనం 

ఏఓబీ నుంచి రాష్ట్రానికి గంజాయి
ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతున్నదని, అక్కడి నుంచి చింతూరు – భద్రాచలం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా జరుగుతున్నట్లు ఎక్సైజ్, పోలీసు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీన్ని అరికట్టేందుకు ఇతర రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్‌ శాఖలతో సమన్వయ వ్యవస్థ అవసరముందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలోకి ఎక్కువశాతం గంజాయి ఇతర రాష్ట్రాల నుంచే వస్తోందని, ఛత్తీస్‌గఢ్‌లో సైతం గంజాయి సాగు, సరఫరా జరుగుతోందని తెలిపారు. గంజాయిని వినియోగిస్తున్న వారిలో వలస కూలీలు, యువకులు ఎక్కువగా ఉన్నారని, ఆటో డ్రైవర్లు, హమాలీలు కూడా ఉన్నట్లు వివరించారు.

కాగా మత్తు పదార్థాలతో వచ్చే అనర్థాలపై ప్రభావపూరితమైన షార్ట్‌ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు, సందేశాత్మక ఆడియో, వీడియో ప్రచార ప్రకటనలను రూపొందించే బాధ్యతను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు సీఎం అప్పగించారు. విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగే విధంగా ప్రత్యేక పాఠాలను రూపొందించి, సిలబస్‌లో చేర్చాలని, అందుకవసరమయ్యే చర్యలు ప్రారంభించాలని ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ను ఆదేశించారు. డ్రగ్స్‌ దుష్ఫలితాలపై ప్రతిభావంతంగా నిర్మించే సినిమాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని సీఎం పేర్కొన్నారు. కాగా గంజాయి వినియోగంలో హాట్‌ స్పాట్లుగా మారిన సెంటర్లను వెంటనే గుర్తించి, నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి అధికారులకు సూచించారు.  

మరిన్ని వార్తలు