సాగునీటి వ్యవస్థలను పటిష్టం చేయాలి

25 Mar, 2021 03:11 IST|Sakshi

అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం 

ప్రాజెక్టులపై సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థలను పటిష్టం చేయాలని, ఇందుకోసం ఇరిగేషన్‌ శాఖ ఓ అండ్‌ ఎం (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో పంట పొలాలకు నిరంతరం నీరందిస్తున్నామని, రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణలో సాగునీటి రంగానికి ప్రాధాన్యం పెరిగిందని ఆయన అన్నారు. పాలమూరు, కల్వకుర్తి, జూరాల అనుసంధానం, కాలువల నిర్మాణాలు, విస్తరణ మీద బుధవారం మూడో రోజు ప్రగతిభవన్‌లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిం చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్యారేజీల నుంచి మొదలుకుని చివరి డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ దాకా.. నీటిని తీసుకెల్లే అన్ని వ్యవస్థలను పటిష్ట పరుచుకోవాలన్నారు. కాల్వలు, పంపులు, బ్యారేజీల గేట్లు, రిజర్వాయర్లు తదితర అన్నిరకాల వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించుకుంటూ నీటిపారుదలను సక్రమంగా నిర్వహించాలన్నారు.

మరమతుల కోసం రెండు పంటల నడుమ ఖాళీ సమయాన్ని వినియోగించుకోవాలని సీఎం సూచిం చారు. ఓఅండ్‌ఎంకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. ప్రతి సాగునీటి కాల్వ చెత్తా, చెదారం లేకుండా అద్దంలా ఉండాలని అన్నారు.   

మరిన్ని వార్తలు