వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు.. 23న శ్రీకారం

16 Nov, 2020 04:02 IST|Sakshi

సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ చేతుల మీదుగా ప్రారంభం 

ధరణి పోర్టల్‌కు విశేష ఆదరణ

మూడు నాలుగు రోజుల్లో అన్ని రకాల సమస్యలను ధరణి అధిగమిస్తుంది 

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌ : ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్‌ ప్రారంభం అయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రారంభిస్తారని సీఎం తెలిపారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించే అంశంపై ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

‘ధరణి పోర్టల్‌ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నది. అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నది. భూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. ధరణి ద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని, నిశ్చింతను వ్యక్తం చేస్తున్నరు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ అద్భుతంగా వున్నది. ధరణి పోర్టల్‌ చిన్న చిన్న సమస్యలను అధిగమించింది. మరో మూడు నాలుగు రోజులలో నూటికి నూరుశాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నది. ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబడినంకనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నం. అందుకే కొన్ని రోజులు వేచి చూసినం. ధరణి పోర్టల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌., సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు , రెవెన్యూశాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు