పీవీ జ్ఞాన్‌మార్గ్‌గా నెక్లెస్‌రోడ్డు : కేసీఆర్‌

28 Aug, 2020 18:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముద్దుబిడ్డ, దేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. అలాగే నెక్లెస్‌రోడ్డుకు పీవీ జ్ఞాన్‌ మార్గ్‌గా పేరు పెట్టాలని, హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్‌ ఏర్పాటుకు కేసీఆర్ సంకల్పించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో పీవీ శతజయంతి వేడుకల నిర్వహణపై శుక్రవారం సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీకి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమం‍త్రిగా పీవీ సాహసోపేతమైన భూ సంస్కరణలు అమలు చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. (సంస్కరణల ఆద్యుడు పీవీ)

ఆయన సంస్కరణల ఫలితంగానే తెలంగాణలో 93 శాతం మంది చిన్న, సన్నకారు రైతులకు భూమి వచ్చిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర్చడంతో పాటు..అనేక రంగాల్లో సంస్కరణలు తెచ్చిన పీవీ ఆదర్శప్రాయుడని కేసీఆర్‌ కొనియాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పీవీకి మరింత గౌరవం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లక్నేపల్లి, వంగర గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయించారు. పీవీ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దేశ,విదేశాల్లో కూడా పీవీ శత జయంతి వేడుకలు నిర్వహించాలన్నారు. పార్లమెంట్‌లో మాజీ ప్రధాని విగ్రహం ‍ప్రతిష్టించాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. (ధీశాలి.. సంస్కరణశీలి)
 

మరిన్ని వార్తలు