త్వరలోనే భూముల డిజిటల్‌ సర్వే: కేసీఆర్‌

18 Feb, 2021 20:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గురువారం ప్రగతి భవన్‌లో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంటనే సర్వే కోసం టెండర్లు పిలవాలని ఆదేశించారు. డిజిటల్‌ సర్వేతోనే భూ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సర్వే కరోనా కారణంగా ఆలస్యం అయిందని తెలిపారు. ఇక ఒకేసారి సర్వే పూర్తయితే రైతుల మధ్య భూ పంచాయతీలు ఉండవని, ఇక పోడు భూముల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. 

కాగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమయిందని కేసీర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూలో సంస్కరణలు తెచ్చిన ఫలితంగా, రెవెన్యూ శాఖ పని విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు కూడా జాబ్ చార్టు రూపొందించనున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు