గట్టెక్కించండి.. మరో మార్గం లేదు..

21 Sep, 2021 19:55 IST|Sakshi
ప్రగతిభవన్‌లో సమీక్ష చేస్తున్న సీఎం కేసీఆర్‌

చార్జీల పెంపుపై సీఎంకు ఆర్టీసీ, విద్యుత్‌ అధికారుల అభ్యర్థన

కరోనా కష్టాల నుంచి గట్టెక్కాలంటే మరో మార్గం లేదని వెల్లడి 

వెంటనే సంబంధిత ప్రతిపాదనలు అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశం 

వచ్చే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టీకరణ 

రెండు విభాగాలపై సుదీర్ఘంగా సమీక్షించిన సీఎం

రూ.3 వేల కోట్లు కోల్పోయాం.. 
గత ఏడాదిన్నరగా డీజిల్‌ ధర లీటర్‌పై రూ.22 మేర పెరిగింది. దీంతో రూ.550 కోట్ల అదనపు భారం పడింది. విడిభాగాల ధరలూ బాగా పెరిగాయి. దీంతో సాలీనా రూ.600 కోట్ల భారం పెరిగింది. కరోనా లాక్‌డౌన్‌లతో మొత్తంగా రూ. 3 వేల కోట్ల ఆదాయాన్ని సంస్థ కోల్పోయింది.      –ఆర్టీసీ అధికారులు 

తీవ్ర నష్టాలు వచ్చాయి
విద్యుత్‌ సంస్థలు కూడా కోవిడ్‌ ప్రభావానికి గురై తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. రాష్ట్రంలో ఆరేళ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదు. విద్యుత్‌ శాఖను గట్టెక్కించేందుకు చార్జీలు పెంచాలి. – విద్యుత్‌ అధికారులు 

ఆదాయంపై దృష్టి పెట్టండి.. 
ఎంతసేపూ సిటీ బస్సుల నష్టాలు, పల్లె వెలుగు కష్టాల గురించి మాట్లాడకుండా.. ఆదాయాన్ని తెచ్చిపెట్టే దూరప్రాంత సర్వీసులపై దృష్టి సారించాలి. సంస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కొత్త ఎండీ సజ్జనార్‌పై ఉంది. ఆయనకు అధికారులు పూర్తి సహాయసహకారాలు అందించాలి.  – సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పెంచనుంది. కోవిడ్‌తో ఈ రెండు విభాగాలు బాగా దెబ్బతిని తీవ్ర నష్టాలు వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఆ సేవలు ప్రజలకు సాఫీగా అందాలంటే చార్జీలు తక్షణం పెంచాల్సిన అవసరం ఉందని విద్యుత్, ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దృష్టికి తెచ్చారు. కోవిడ్‌ తర్వాత పరిస్థితులు, వాటితో సంస్థలకు వాటిల్లిన నష్టాలను ఆయనకు వివరించారు. దీంతో చార్జీల పెంపు ఎంతవరకు ఉండొచ్చో.. రెండుమూడు ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి అందిస్తే, ఆ భేటీలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీ, విద్యుత్‌ విభాగాల  అధికారులతో కేసీఆర్‌ సుదీర్ఘంగా సమీక్షించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు ఆయన చర్చించారు.  

సాలీనా రూ.600 కోట్ల భారం... 
తొలుత ఆర్టీసీపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలోని 97 డిపోలు నష్టాల్లో కూరుకుపోయాయని సమావేశంలో అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇలాంటి తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో సంస్థ మనుగడ సాగాలంటే ఇప్పటికిప్పుడు బస్సు చార్జీలు పెంచుకోవాల్సిన పరిస్థితి తప్ప గత్యంతరం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. డీజిల్‌ ధర లీటర్‌కు రూ.65 ఉన్నప్పుడు 2019, డిసెంబర్‌లో చార్జీలు పెంచామని, ఆ తర్వాత పెంచలేదని, ప్రస్తుతం లీటరు డీజిల్‌ ధరల రూ.100కు చేరువైందని లెక్కలు ముందుంచి వివరించారు. గతేడాది మార్చిలోనే ఆర్టీసీ చార్జీలు పెంచనున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించిందని, అయితే కోవిడ్‌ కారణంగా ప్రజల సమస్యలను గుర్తించి వారిపై భారం మోపొద్దన్న ఉద్దేశంతో పెంచలేదని మంత్రి అజయ్‌కుమార్, అధికారులు వెల్లడించారు.

కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఉద్యోగుల సంక్షేమానికి ఇబ్బంది రాకుండా చూసుకుంటూనే ఆర్టీసీని పటిష్ట పరిచే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తే కోవిడ్‌ నష్టం, డీజిల్‌ భారం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆర్టీసీని పరిరక్షించడం, దాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్‌ అన్నారు. చార్జీల పెంపు ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి అందించాలని సూచించారు.  

విద్యుత్తు చార్జీలు కూడా.. 
సమావేశం ముగిసే సమయంలో విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డి, జెన్‌కో, ట్రాన్స్‌ కో సీఎండీ ప్రభాకర్‌రావు.. విద్యుత్‌ అంశాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ తరహాలో విద్యుత్‌ సంస్థలు కూడా కోవిడ్‌ ప్రభావానికి గురై తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరేళ్లుగా కరెంటు చార్జీలు పెంచలేదని, విద్యుత్‌ శాఖను గట్టెక్కించేందుకు చార్జీలు పెంచాలని వారు సీఎంను కోరారు. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి విద్యుత్‌ బిల్లుల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు అందించాలని సీఎం వారికి సూచించారు.  

ఈ సమీక్షలో ఇందులో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శి రాజశేఖరరెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, జెన్‌కో అండ్‌ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.  
    

మరిన్ని వార్తలు