పీవీకి భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్‌

8 Sep, 2020 11:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. వర్షాకాల శాసనసభ రెండో రోజు సమావేశాలు మంగళవారం  ప్రారంభమయ్యాయి. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని ఈ సందర్భంగా సభలో ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పీవీ అని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ మన ఠీవి అని, ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

గ్లోబల్‌ ఇండియా నిర్మాత పీవీ నరసింహారావు అని, దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పీవీ ప్రధాని అయ్యారని కేసీఆర్‌ తెలిపారు. పీవీ అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. మన్మోహన్‌ సింగ్‌ను ఆర్థిక మంత్రి చేసిన ఘనత పీవీది అని పేర్కొన్నారు. పీవీ నాటిన సంస్కరణ ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని సీఎం తెలిపారు. భూ సంస్కరణలకు పీవీనే నాంది పలికారని గుర్తుచేశారు. తన సొంత భూమి 800 ఎకరాలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని కొనియాడురు. హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్‌​ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.

పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి: భట్టి
కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతిస్తున్నామని తెలిపారు. సంక్షోభాల సమయంలో చాకచాక్యంగా పీవీ పాలన చేశారని గుర్తు చేశారు. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని భట్టి పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. యుద్ధంలో గెలిచినవారే చరిత్రను రాస్తారని తెలిపారు. పీవీ స్థాయికి తగ్గ విధంగా భారత ప్రభుత్వం గుర్తించాలని కోరారు. తెలంగాణ ఉద్యమం అస్తిత్వ పోరాటమని పీవీ చెప్పారని గుర్తు చేశారు.

కాగా, నేడు అసెంబ్లీలో నాలుగు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ప్రైవేట్‌ యూనివర్శిటీల బిల్లును మంత్రి సబితారెడ్డి సభలో పెట్టనున్నారు. తెలంగాణ డిజాస్టర్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్‌-2020, తెలంగాణ ఫిస్కల్‌ రెస్పాన్స్‌బిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు -2020, ఆయుష్‌ మెడికల్‌ కాలేజీల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా