ఈ చట్టంతో మన ‘పవర్‌’ జీరో! 

16 Sep, 2020 03:17 IST|Sakshi

నూతన విద్యుత్‌ చట్టం సవరణ బిల్లుపై సభలో సీఎం కేసీఆర్‌

రాయితీ పథకాలన్నీ పోతాయి

సబ్‌ లైసెన్స్‌డ్‌ విధానంతో విద్యుత్‌ సంస్థల భవిష్యత్తు సంకటంలో పడుతుంది

ప్రైవేటు సంస్థల చేతుల్లోకి అధికారం పోతుంది

ఈ బిల్లు వద్దని రెండు నెలల క్రితం మోదీకి ఉత్తరం రాశా... కానీ వినలేదని సీఎం వెల్లడి

ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తేనున్న నూతన విద్యుత్‌ చట్టం అత్యంత ప్రమాదకరమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆందో ళన వ్యక్తం చేశారు. త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే పేద ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు, విద్యుత్‌ రంగంపై రాష్ట్ర ప్రభుత్వాల అధికారం శూన్యమవుతుందని వ్యాఖ్యానించారు. విద్యుత్‌ పంపిణీలో ఇప్పటి వరకు అమలు చేసిన రాయితీ పథకాలన్నీ హరించుకుపోతాయని, ముఖ్యంగా రైతులకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ పథకం ఉండదన్నారు. రైతులు వేసిన ప్రతి బోరుకు మీటర్లు బిగించక తప్పదని, అదేవిధంగా వినియోగించిన విద్యుత్‌కు తప్పనిసరిగా బిల్లు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఒక రకంగా విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా పోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ చట్టం 2003 సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీలో దీనిపై వాడివేడి చర్చ జరిగింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశాలకు సీఎం సమాధానం ఇవ్వాలని కోరడంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నూతన విద్యుత్‌ చట్టం–2003 సవరణ బిల్లులోని అంశాలను సభకు వివరించారు. ఆయన ఏమన్నారంటే...

‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లుకు సంబంధించి ముసాయిదా విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలకు కూడా బిల్లు కాపీలను పంపారు. దాన్ని లోతుగా చదివిన తర్వాత ప్రజలకు, రైతులకు కీడు చేసే విధంగా, కిరాతకంగా ఈ చట్టం ఉందని గుర్తించా. ఈ చట్టం తేవొద్దని రెండు, మూడు నెలల కిందటే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉత్తరం రాశా. ఈ చట్టం వస్తే ప్రజలు, రైతులు పడే ఇబ్బందులను వివరించా. కానీ నా ఆందోళనను కేంద్రం ఆలకించలేదు. పార్లమెంటులో ప్రవేశ పెట్టే బిల్లుల జాబితాలో ఇది కూడా ఉంది. దీన్ని వ్యతిరేకించాలని మా పార్లమెంటు సభ్యులకు సూచించా.’అని అన్నారు.

డిస్పాచ్‌ సెంటర్లు ఢిల్లీకి...
నూతన విద్యుత్‌ చట్టం–2003 సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా సమస్య వస్తే ఇప్పటివరకు హైదరాబాద్‌లోని డిస్పాచ్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసేవాళ్లం. కొత్త చట్టంతో డిస్పాచ్‌ సెంటర్‌ ఢిల్లీకి పోతది. అక్కడికి ఫోన్‌ చేసి మా సమస్య చెప్పుకోవల్సి వస్తది. సీడబ్ల్యూసీ గణాంకాల ప్రకారం మనదేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉంటే ఇప్పటివరకు 28 వేల టీఎంసీల నీళ్లను మాత్రమే వాడుతున్నం. దేశంలో ఉన్న 40 కోట్ల ఎకరాల సాగుభూమికి, తాగునీటి అవసరాలకు ఈ నీళ్లను పూర్తిస్థాయిలో వినియోగించుకున్నా మరో వందేళ్లు నీటికి కటకట ఉండదు. కానీ ఇప్పుడే చెన్నైలాంటి నగరాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రస్తుత స్థాపిత విద్యుత్తు 4 లక్షల మెగావాట్లు. కానీ ఇప్పటివరకు గరిష్టంగా వినియోగించిన విద్యుత్‌ 2.19 లక్షల మెగావాట్లు మాత్రమే. మిగతా విద్యుత్‌ను వాడకుండా బ్యాక్‌డౌన్‌ చేస్తున్నాం. చాలా విద్యుత్‌ సంస్థలు నడుస్తలేవు.

ఈ విద్యుత్‌ను పూర్తిస్థాయిలో వినియోగించి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి. కానీ పవర్‌ అంతా తన చేతుల్లోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలనే భావన మంచిది కాదు. విద్యుత్‌ కొరత చాలా రాష్ట్రాల్లో ఉంది. బిహార్‌లోని పాట్నాలో యువకులు నాలుగైదు జనరేటర్లు పెట్టుకుని కరెంటు అమ్ముకుంటున్నారు. యూపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీన్ని పట్టించుకోకుండా కొత్తగా ఈ బిల్లును తీసుకురావడం దుర్మార్గం. ఒక రకంగా ఈ చట్టం కిరాతకమైందని చెప్పాలి. ఓపెన్‌ యాక్సెస్‌ పరిశ్రమలకు విద్యుత్‌ను ఒక నియంత్రిత పద్దతిలో సరఫరా చేస్తున్నాం. కొత్త చట్టం అమలైతే వాటికి దేశంలో ఎక్కడ నుంచైనా విద్యుత్‌ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. డిస్ట్రిబ్యూటరీ సబ్‌లైసెన్స్‌ విధానాన్ని ఈ చట్టం ప్రొత్సహిస్తుంది. దీంతో దేశంలో విద్యుత్‌ అమ్మకాలకు లైసెన్స్‌డ్‌ డీలర్లు ఉంటారు. వాళ్లు ఎక్కడ్నుంచి ఎక్కడికైనా విద్యుత్‌ కొనుగోలు చేసి అమ్ముకోవచ్చు. దీంతో డిస్కంలు ఉంటయో, పోతయో తెలియని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ కుప్పకూలింది. ఎల్‌ఐసీని కూడా ప్రైవేటీకరిస్తున్నరు. విమానాలు, రైళ్లు ప్రైవేటు చేతుల్లోకి పోతున్నయ్‌. మొత్తంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అంతరించిపోయేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

ప్రైవేటుకు ఇవ్వనని చెప్పా...
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన యాదాద్రి, భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నాపై చాలా ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం చేతిలో ఈ సంస్థలుంటే లాభం వస్తే మరోచోట కొత్త యూనిట్‌ను తెరవచ్చు. నిరుద్యోగులకు ఉపాధి దొరకడంతో పాటు ప్రజలకు రాయితీపై నాణ్యమైన విద్యుత్‌ దొరుకుతుంది. రైతులకు ఉచిత విద్యుత్‌లాంటి పథకాలు అమలు చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఫ్రీకరెంటు ఇవ్వొచ్చు. అదే ప్రైవేటు సంస్థకు ఇస్తే వచ్చిన లాభాన్ని జేబులో వేసుకుని తనకిష్టమున్నచోట పెట్టుబడి పెడతడు. దీంతో ప్రజలకు ఒరిగేదేం ఉండదు. కొత్త చట్టంతో క్రాస్‌ సబ్సిడేషన్‌ ఉండడదు. రెన్యువబుల్‌ ఎనర్జీని 20 శాతం వాడాలని చట్టంలో ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్న సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు రెన్యువబుల్‌ ఎనర్జీ కేటగిరీలోకి రావని చెబుతున్నరు. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం సూచించిన కంపెనీ దగ్గర్నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలన్నమాట. కొనకుంటే ఫైన్‌ కట్టాలని కూడా అంటున్నరు. యూనిట్‌పై 50 పైసల నుంచి రూ.2 వరకు చార్జ్‌ చేస్తరట. మొత్తంగా మిమ్మల్ని బతకనీయమని కేంద్రం... రాష్ట్ర ప్రభుత్వాలకు చెబుతున్నట్లు ఉంది. ఈ బిల్లును తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, బెంగాల్, రాజస్తాన్, ఢిల్లీ తదితర పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రజా ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్న ఈ బిల్లును కేంద్రం వెనక్కు తీసుకోవాలి’అని సీఎం డిమాండ్‌ చేశారు.

చేతులెత్తి దండం పెడుతున్నా...
‘కొత్త చట్టం వస్తే ప్రతి వ్యవసాయ బోరుకు మీటర్‌ పెట్టాలి. మీటర్లు బిగించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో 27 లక్షల బోరు మోటర్లు ఉన్నయి. వాటితో పాటు మరో 50వేల మోటర్లు కాలువలపైన ఉన్నాయి. వీటన్నిటికీ మీటర్లు బిగించాలి. ఇందుకు దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుంది. నెలవారీ బిల్లుల జారీ, వసూళ్లకు బిల్‌ కలెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలి. నేను చిన్నగున్నప్పుడు బిల్‌ కలెక్టర్లను చూసేవాడిని. జిల్లా కలెక్టర్‌ కంటే బిల్‌ కలెక్టర్లకు ఎక్కువ భయపడెటోళ్లు. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. కొందరు చాలా మాట్లాడుతున్నరు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టడాన్ని రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే ఒప్పుకుంటారా.? సమాధానం చెప్పాలి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 22వేల మంది ఆర్టిజన్లను క్రమబద్దీకరించాం. ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఉంటయో పోతయో తెలియదు. ఈ చట్టం అన్ని వర్గాలకు గొడ్డలిపెట్టు. ఇది పూర్తిగా రాష్ట్రాల అధికారాన్ని నియంత్రించే చట్టం. మీకు బలముంటె ఉండనీ, కానీ చట్టాన్ని తేవొద్దని చేతులెత్తి దండం పెడుతున్న. ప్రిస్టేజికి పోవద్దు, ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి.’అని సీఎం అన్నారు.

చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్టం 2003 సవరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర శాసనసభ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉందని, రైతులు, పేదల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఈ బిల్లు రూపకల్పన జరిగిందని పేర్కొంది. దేశ ప్రజలపై ఈ చట్టాన్ని రుద్దొద్దని, కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానించింది. సీఎం కేసీఆర్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

రాష్ట్రం రాయితీలిస్తామంటే కేంద్రం వద్దంటుందా? :సీఎల్పీనేత భట్టి
కేంద్ర ప్రభుత్వం త్వరలో అమల్లోకి తేవాలని యోచిస్తున్న నూతన విద్యుత్‌ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పలు సందేహాలకు తావిస్తుందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. నూతన చట్టం అమల్లోకి వస్తే రాయితీలు ఇచ్చే అవకాశం ఉండదని మంత్రి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తామంటే కేంద్రం ఎందుకు వద్దంటుందని ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని కోరారు. నూతన చట్టంపై మరింత లోతైన సమాచారం ఇస్తే తమ అభిప్రాయాలను చెబుతామన్నారు. ప్రభుత్వాలు ఏ చట్టం చేసినా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని హితవు పలికారు. 

మరిన్ని వార్తలు