చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌.. దేశంలో ఇదే తొలిసారి

8 Aug, 2022 02:12 IST|Sakshi

ఆదివారం నుంచి అమల్లోకి కొత్త పథకం 

చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ చేనేత దినోత్సవం(ఆగస్టు 7న) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 7 నుంచి ‘నేతన్న బీమా’పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుందన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నేతన్నల కోసం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం దేశంలో తొలిసారని సీఎం తెలిపారు.

దాదాపు 80 వేల మంది నేత కార్మికుల కుటుంబాలు లబ్ధి పొందడం సంతోషకరమని చెప్పారు. దురదృష్టవశాత్తు ఎవరైనా నేత కార్మికుడు చనిపోతే అర్హులైన వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించే ఈ పథకం.. చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. ఎన్ని కష్టాలనైనా తట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి, ఆ రంగంపై ఆధారపడిన పద్మశాలీ తదితర కుటుంబాలకు అన్ని వేళలా బాసటగా నిలుస్తుందని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.  
చదవండి: ‘చేనేతపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలి’ 

మరిన్ని వార్తలు