కలెక్టర్ల భుజాలపై ధరణి..

1 Jan, 2021 02:04 IST|Sakshi

సమస్యలు పరిష్కరించాల్సింది వారే..

60 రోజుల్లోగా పార్ట్‌–బీలోని భూముల వివాదాలన్నీ పరిష్కరించాలి

‘22/ఏ’లోని భూములపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలి

భూవివాదాలపై కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్‌ 

‘ధరణి’పై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ భూవివాదాలు, ఇతర వ్యవహారాల్లో జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంచ లన నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్లే ఈ బాధ్యత లను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్దిపాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు 2 నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని ప్రకటించారు. ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగుపరుస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ, ఇంకా మెరుగు పర్చాల్సిన అంశాలపై గురువారం ఆయన ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

అవసరమైతే క్షేత్రస్థాయి విచారణ..
‘కోర్టుల విచారణలో ఉన్నవి మినహా, భూరికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్‌–బీలో చేర్చిన భూములకు సంబంధించిన అంశాల న్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలి. అవసరమైన సంద ర్భాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకో వాలి. యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. రెవెన్యూ కోర్టుల్లోని వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకు ఒకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. సరిహద్దు వివాదాలున్న చోట జిల్లా కలెక్టర్లు సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలి.  చదవండి: (‘ఆయుష్మాన్‌’తో ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం)

ధరణి పోర్టల్‌ రాకముందు రిజిస్ట్రేషన్‌ అయిన భూములను రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్ల ఆధారంగా, కొన్నవారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్‌ చేయాలి. మీ–సేవ ద్వారా మ్యుటేషన్‌ దరఖాస్తులు స్వీకరించి, స్లాట్లు కేటాయించాలి.. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. క్రమబద్ధీకరించిన సాదాబైనామాల ప్రకారం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలి. పట్టాదారు పాస్‌ బుక్కులు ఇవ్వాలి’అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

ధరణిలో కొత్తగా కోర్టు పోర్టల్‌..
‘కోర్టుల ద్వారా, కలెక్టర్ల ఆధ్వర్యంలోని ట్రిబ్యునళ్ల ద్వారా వచ్చిన అధికారిక తీర్పుల ప్రకారం ధరణిలో భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేపట్టాలి. కోర్టు పోర్టల్‌ను ధరణిలో చేర్చాలి. సేత్వార్‌ వ్యత్యాసాలపై కలెక్టర్లు విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలి. ఆ వివరాలను ధరణిలో నమోదు చేసి, పాసుబుక్కులు ఇవ్వాలి. కొన్నిచోట్ల ఒకే సర్వే నంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్నాయి. ఆ సర్వే నంబరును నిషేధిత జాబితా (22/ఏ) లో పెట్టారు. అలా పెట్టిన చోట్ల కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ భూమో, ఏది ప్రైవేటు భూమో నిర్ణయించాలి. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్‌ పుస్తకాలు ఇవ్వాలి..’అని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.

సమావేశంలో విస్తృత చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ జారీ చేసిన ఆదేశాలివే..
►1/70 చట్టం అమలులో లేని ప్రాంతాల్లో ఆ చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించాలి. 1/70 చట్టం అమలులో ఉన్న ప్రాంతాల్లో భూములపై ఆ ప్రాంత ఎస్టీల హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి.
►ధరణి పోర్టల్‌ ద్వారా లీజ్‌ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి.
►‘నాలా’ద్వారా కన్వర్ట్‌ అయిన భూముల వివరాలను ధరణిలో నమోదు చేసి, వాటికి ప్రొసీడింగ్స్‌ ఇవ్వాలి.
►అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ కమ్‌ జీపీఏ చేసుకోవడానికి ధరణి పోర్టల్‌ ద్వారా అవకాశమివ్వాలి.
►వ్యవసాయ భూమల లీజు డీడ్, ఎక్సే్చంజ్‌ డీడ్‌ల రిజిస్ట్రేషన్లకు ధరణిలో అవకాశం కల్పించాలి. 
►వ్యవసాయ భూముల్లో నెలకొల్పే సంస్థలు, కంపెనీలు ఆ భూములు అమ్ముకునేందుకు, కొనుక్కునేందుకు ధరణిలో తక్షణం అవకాశం కల్పించాలి.
►పాస్‌పోర్టు నంబరు నమోదు చేసుకుని ఎన్‌ఆర్‌ఐల భూములు రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశం కల్పించాలి.
►ఈసీల మార్కెట్‌ వ్యాల్యూ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో ప్రింట్‌ తీసుకునే అవకాశం కల్పించాలి.
►ఏదైనా అనివార్య కారణాల వల్ల స్లాట్‌ బుక్‌ చేసుకున్న రోజు రాని వారికి స్లాట్‌ రద్దు చేసుకోవడానికి, మరో రోజు బుక్‌ చేసుకునేందుకు అవకాశమివ్వాలి. స్లాట్‌ బుకింగ్‌ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి ఇవ్వాలి.
►స్లాట్‌ బుక్‌ చేసుకునేప్పుడు వివరాలు తప్పుగా నమోదైతే, స్లాట్‌ బుక్‌ చేసుకున్న చోటే వాటిని సవరించుకునేందుకు రిజిస్ట్రేషన్‌ కన్నా ముందు అవకాశం కల్పించాలి.
►చట్టబద్ధ వారసుల పేర్లను రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో అనుమతిదారుల (కన్సెంటింగ్‌ పార్టీ) కేటగిరీ కింద నమోదు చేసుకునే ఆప్షన్‌ కల్పించాలి.
►మైనర్ల పేరిట భూములు రిజిస్ట్రేషన్‌ చేసే సందర్భంలో మైనర్లు, సంరక్షుల పేర పట్టాదారు పాస్‌ పుస్తకం ఇవ్వాలి. 
►ప్రభుత్వం అసైన్‌ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించాలి.
►పట్టాదార్‌ పాసుబుక్కులు పోయినట్లయితే, వాటి స్థానంలో ‘ట్రూ కాపీ’తీసుకునే అవకాశం కల్పించాలి.
►ప్రభుత్వ భూములు, చెరువు ఎఫ్‌.టి.ఎల్‌. భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్‌ భూములు, అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్‌ చేయవద్దు. 
►ఇనాం భూములను సాగు చేసుకుంటున్న హక్కుదారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి, ఆ వివరాలను ధరణిలో నమోదు చేయాలి. 
►ధరణిలో స్లాట్‌ బుక్‌ కాకపోతే, ఎందుకు కావడం లేదనే విషయం దరఖాస్తుదారుడికి తెలిపే ఆప్షన్‌ ధరణిలో ఉండాలి. 

రైతులకు ఇబ్బంది ఉండొద్దనే ‘ధరణి’: సీఎం కేసీఆర్‌
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండవద్దనే ఉద్దేశంతో తెచ్చిన ధరణి పోర్టల్‌ ఆశించిన ఫలితాలు సాధిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. 2 నెలల వ్యవధిలోనే లక్షా 6 వేల మంది ధరణి ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోగా వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి చేసుకున్నారని చెప్పారు.

రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్‌ చేయించుకుని, మ్యుటేషన్‌ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, రెవెన్యూ వ్యవహారాల నిపుణులు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు రామయ్య, సుందర్‌ అబ్నార్, రఫత్‌ అలీ, జిల్లా కలెక్టర్లు వెంకట్రాంరెడ్డి, హనుమంతరావు, ప్రశాంత్‌ పాటిల్, నారాయణరెడ్డి, శశాంక్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు