నేడు వాసాలమర్రికి కేసీఆర్‌

22 Jun, 2021 03:18 IST|Sakshi
వాసాలమర్రిలో ముస్తాబవుతున్న గ్రామసభ వేదిక 

గ్రామస్తులతో కలసి సహపంక్తి భోజనం 

గ్రామసభలో ప్రజలతో ముఖాముఖీ 

వాసాలమర్రి సమగ్రాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం 

సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 2020 అక్టోబర్‌ 31న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించి తిరుగుప్రయాణంలో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్తూ వాసాలమర్రిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడిన విషయం విదితమే. అప్పట్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం రానున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి తరహాలో వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయం విదితమే. కేసీఆర్‌ తొలుత గ్రామస్తులతో కలసి సహపంక్తి భోజనం చేస్తారు. అనంతరం గ్రామసభలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.  

గ్రామస్తుల్లో ఆనందం 
తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్న ఈ మారుమూల పల్లెకు ఇప్పుడు మహర్దశ పట్టబోతోంది. సీఎం రాకతో ఏళ్లతరబడి అభివృద్ధికి నోచుకోని వాసాలమర్రి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయన్న విశ్వాసంతో గ్రామస్తులు ఉన్నారు. గ్రామసభలో సీఎంతో తాము నేరుగా మాట్లాడుతామన్న ఆనందం వారిలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు, పాఠశాలలు, సామాజిక పింఛన్లు, మౌలిక సదుపాయాల కల్పన, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, యువతకు ఉపాధి అవకాశాలు, వ్యవసాయం, పాడిపరిశ్రమతో పాటు గ్రామ సమగ్రాభివృద్ధి ప్రణాళికను సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు అధ్యక్షతన జరిగే సభలో ఆమోదించనున్నారు.

నివేదిక సిద్ధం 
గ్రామ సమగ్రాభివృద్ధికి అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించి నివేదిక సిద్ధం చేశారు. శిథిలావస్థలో ఉన్న 670 పాత ఇళ్ల స్థానంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించనున్నారు. అలాగే 5 వేల మీటర్ల మేర సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, గ్రామ పంచాయతీ భవనం, రెండు అంగన్‌వాడి భవనాలు, 120 మంది యువతకు రుణాలు, స్కిల్, అన్‌స్కిల్డ్‌ యువతకు స్వయం ఉపాధి పథకాలు, వాహనాలు, హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, డెయిరీ యూనిట్లు, సీడ్‌ ప్లాంట్, వ్యవసాయ బోరు బావులు, ఫంక్షన్‌ హాల్, పీహెచ్‌సీ సెంటర్, విద్యుత్‌ సబ్‌సెంటర్, పాడిపశువుల పంపిణీ, భూమి లేని రైతు కూలీలకు భూములు, పంటల రక్షణకు అటవీ భూముల చుట్టూ కంచె ఏర్పాటుతో పాటు మరికొన్ని అంశాలపై గ్రామసభలో తీర్మానం చేయనున్నారు.  

మా ఊరు అన్ని రంగాల్లో బాగుపడాలి 
సీఎం దత్తత తీసుకున్న తర్వాత మా వాసాలమర్రి అన్ని రంగాల్లో బాగుపడుతుందని ఆ శిస్తున్నాం. గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతి అంశాన్ని సీఎంకు విన్నవిస్తాం. విద్యార్థులు, వ్యవసాయదారులు, మహిళలు, నిరుద్యోగుల భవిష్యత్‌ మారుతుందని గ్రామస్తులు ఆశతో ఉన్నారు. 
– పోగుల ఆంజనేయులు, సర్పంచ్‌ 

సంతోషంగా ఉంది 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ మా ఊరి అభివృద్ధికి పూనుకోవడం, ప్రత్యేకంగా నేడు గ్రామానికి వ స్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. గ్రామస్తు లందరూ ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరి సమస్యలు, అభివృద్ధి గురించి సీఎం దృష్టికి తీసుకుపోతాం. గ్రామంలో పండుగ వాతావరణంలా ఉంది.     – జహంగీర్, గ్రామస్తుడు 

వానకు ఇల్లు కురుస్తుంది 
మాది ఎనకటి నుంచి పెంకుటిల్లు. కోతులు పెంకలు పగుల గొట్టడంతో వర్షానికి ఇల్లు మొత్తం కురుస్తుంది. ముఖ్యమంత్రి సార్‌ మా ఊరును దత్తత తీసుకున్నడని సంతోషంగుంది. మాకు గూడ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు వస్తదని ఆశతో ఉన్నాం.     – తడక కనకలక్ష్మి, వాసాలమర్రి 

ఉద్యోగ అవకాశాలు కల్పించాలి 
సీఎం కేసీఆర్‌ మా ఊరిని అభివృద్ధి చేసేందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటది. గ్రామసభలో మాట్లాడే అవకాశం వస్తే ఈ విషయం గురించి సీఎం సార్‌ దృష్టికి తీసుకుపోతా. సీఎం వస్తుండటంతో గ్రామానికి కళ వచ్చింది.     – కె.కిష్టమ్మ, గ్రామస్తురాలు  

మరిన్ని వార్తలు