సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

13 Mar, 2023 01:13 IST|Sakshi

గచ్చి బౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు 

సీటీస్కాన్, ఎండోస్కోపీ పరీక్షలు..

కడుపులో చిన్న అల్సర్‌ గుర్తింపు

మందులతో నయం అవుతుందని ఏఐజీ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌/గచ్చి బౌలి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్టిక్‌ సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఉదయం హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ వైద్యులు ఆయనకు పలు రకాల పరీక్షలు నిర్వహించారు. కడుపు నొప్పితోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం.

సాధారణ పరీక్షల్లో భాగంగానే ముఖ్యమంత్రి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చి నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నా.. గ్యాస్టిక్‌ సమస్యతోనే ఆస్పత్రికి వచ్చి నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, కూతురు కవిత, కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి మరికొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

ముఖ్యమంత్రిని పరీక్షించిన తర్వాత ఏఐజీ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌ ఉదయం పొత్తికడుపులో అసౌకర్యంగా ఉందని చెప్పారని, దీంతో ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చి సీటీ, ఎండోస్కోపీ పరీక్షలు చేశామని నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. కడుపులో ఒక చిన్న అల్సర్‌ ఉన్నట్లు నిర్ధారించామన్నారు.

అయితే దీనిని మందుల ద్వారా నయం చేయవచ్చని వివరించారు. ఇతర అన్ని రకాల పరీక్షలు సాధారణంగానే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రికి అవసరమైన మందులు ఇచ్చామని చెప్పారు. కాగా, రాత్రి 7.15 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. 

సీఎం సత్వరంగా కోలుకోవాలి: గవర్నర్‌ తమిళిసై 
సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సత్వరం కోలుకోవాలని, స్వస్థత చేకూరాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు