Telangana: ఇది మహాత్ముడి గడ్డ.. జాతిని చీల్చే కుట్రను అడ్డుకుందాం: సీఎం కేసీఆర్‌

8 Aug, 2022 14:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనేక మంది త్యాగాలు, పోరాటాలతో దేశానికి స్వాతంత్రం వచ్చిందని.. అలాంటి గడ్డపై జాతిని చీల్చే కుట్రను అడ్డుకుందామని దేశానికి, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపు ఇచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాలను సోమవారం నగరంలోని హెచ్‌ఐసీసీలో ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. 

అనేక త్యాగాలు, పోరాటాలతో మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. భారత స్వాతంత్ర సముపార్జన సారథి, ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతిదూత, విశ్వమానవుడు మహాత్మాగాంధీ. ప్రపంచంలోని ఎంతో మందికి స్పూర్తి ఆయన. అలాంటి మహోన్నతుడిని కించపరిచే ఘటనలు జరగడం దురదృష్టకరం. గాంధీని కించపరిచే ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. విశ్వమానవుడిపై కొందరు విద్వేషం రగలిస్తున్నారు. కానీ,  మహాత్ముడు ఎప్పటికైనా మహాత్ముడే. ఆ చిల్లర శక్తుల ప్రయత్నాలు ఫలించవు. 

పేదరికం ఉన్నంతవరకు ఆక్రందనలు, అలజడులు దేశంలో కొనసాగుతూనే ఉంటాయి. పేదరికం నిర్మూలిస్తేనే దేశానికి శాంతి, సౌబ్రాతృత్వం లభిస్తుంది. దేశంలో అలజడులను సృష్టించిన బ్లాక్‌ షిప్‌లను తరిమి కొట్టే ఘనత భారత దేశానికి ఉంది. ఈ గడ్డపై జాతిని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి వెకిలి, మకిలి చర్యలను ఖండించాలి. ఆ చిల్లర మల్లర ప్రయత్నాలు, కుట్రలను ఖండించాల్సిన అవసరం ఉందని పిలుపు ఇచ్చారు సీఎం కేసీఆర్‌. 

కూర్పు వెనుక ఎంత కష్టం ఉంటుందో.. దాని విలువ తెలియనివాళ్లే చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, దేశానికి సంఘటితంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం తెలంగాణ ఎప్పుడూ ముందు ఉంటుంది.

ప్రజాప్రతినిధులంతా స్వాతంత్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపు ఇచ్చారు సీఎం కేసీఆర్‌. మహనీయుల కష్టం, త్యాగాలతో దేశం ఈ తీరుకు వచ్చింది. కాబట్టే, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, ఎంతో మంది కష్టపడ్డారని, అలాగే అవసరమైతే తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో వెళ్లి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

ఇదీ చదవండి: కేసీఆర్‌కు నీతి ఆయోగ్‌ ప్రాధాన్యత తెలియదు  

మరిన్ని వార్తలు