సీసీసీ ఆలోచన ఆయనదే.. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే : సీఎం కేసీఆర్‌

4 Aug, 2022 15:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మానవ సమాజం ఉన్నంతకాలం.. పోలీసింగ్‌ వ్యవస్థ నిరంతరం కొనసాగుతుందని, ఆ వ్యవస్థ ఎంత బలంగా, శ్రేష్టంగా ఉంటే.. సమాజానికి అంత రక్షణ, భద్రత ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. 

హైదరాబాద్‌లో ఇంతటి కమాండింగ్‌ వ్యవస్థ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరని, కానీ, చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.  ఈ భవన నిర్మాణానికి ముఖ్య ప్రేరణ, కర్త, రూపకర్త, ప్రధాన వ్యక్తి డీజీపీ మహేందర్‌రెడ్డినే అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. మొత్తం క్రెడిట్‌ ఆయనకే దక్కాలని, అలాగే ఈ భవనం నిర్మాణానికి సహకరించిన సంబంధిత శాఖ మంత్రి, విభాగాలు, కంపెనీలు కూడా ఇందులో భాగం అయినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీసీసీ నిర్వహణ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ.. యావత్‌ పరిపాలనకు ఉపయోగకరంగా ఉంటుందని, నార్మల్‌ రోజుల్లో ఒకలా.. విపత్తుల రోజుల్లో మరోలా ఉంటుందని ఆ సమయంలో మహేందర్‌రెడ్డి చెప్పారని గుర్తు చేసుకున్నారు. గొప్పపనితనం ప్రదర్శించేందుకు గొప్ప వేదిక ఏర్పాటును సాకారం చేసుకున్నందుకు తెలంగాణ పోలీస్‌ శాఖకు హృదకపూర్వక అభినందనలు తెలిపారు. రెండేళ్ల క్రితమే ఈ భవనం పూర్తి కావాలని, కరోనా వల్ల కొద్దిగా ఆలస్య మైందని సీఎం కేసీఆర్‌ వివరించారు. 

సమాజం కోసం పాటుపడుతున్న పోలీసులకు సెల్యూట్‌ చెప్పిన సీఎం కేసీఆర్‌.. సంస్కారవంతమైన పోలీసింగ్‌ వ్యవస్థ అంతటా రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు సమర్థవంతంగా పని చేయాలని, ఆ మహమ్మారిని తరిమి కొట్టాలని పోలీస్‌ శాఖకు పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ సహకారం పోలీసులకు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారాయన. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ మహిళా భద్రత అంశాన్ని.. తమ వెంట వచ్చిన ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిణితో స్వయంగా పరీక్షించి ధృవీకరించిన ఘటనను సైతం సీఎం కేసీఆర్‌ ప్రస్తావించారు. ఫ్రెండ్లీ పోలీస్‌గా తెలంగాణ పోలీసింగ్‌ వ్యవస్థ దేశానికి కలికితురాయి నిలవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు