భూముల విలువలు సవరించండి

30 Jun, 2021 01:15 IST|Sakshi
కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్, హరీశ్, ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌

రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు 

భూములు, ఆస్తుల విలువలు భారీగా పెరిగాయని వివరణ 

త్వరలోనే సీఎం కేసీఆర్‌కు నివేదిక

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి భూములు, ఆస్తుల విలువలు భారీగా పెరిగాయని.. అయినా ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించలేదని గుర్తు చేసింది. నిర్ధారిత విలువల కన్నా ఎక్కువ రేటుతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సవరణను వెంటనే చేపట్టాలని సూచించింది. 

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం.. మంగళవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ)లో సమావేశమైంది. ఇందులో హరీశ్‌రావుతోపాటు మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో భూముల విలువల సవరణ, ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వానికి ఆదాయం పెంచే మార్గాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా సంస్కరణలతో భూముల విలువలు భారీగా పెరిగాయని, భారీగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలతో వ్యవసాయ భూములకూ డిమాండ్‌ పెరిగిందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఎనిమిదేళ్లుగా రిజిస్ట్రేషన్ల విలువ సవరించలేదని.. చట్టప్రకారం ఎప్పటికప్పుడు విలువల సమీక్ష జరగాలని అధికారులు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలు అనేక సార్లు రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించాయని.. అంతేగాకుండా రిజిస్ట్రేషన్‌ ఫీజు తెలంగాణలో 6 శాతంగా ఉంటే.. ఏపీ, తమిళనాడుల్లో 7.5, మహారాష్ట్రలో 7 శాతంగా ఉందని వివరించారు.  

హైదరాబాద్‌ పరిసరాల్లో.. 
ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయంలో చాలా వరకు గ్రేటర్‌ పరిధి నుంచే సమకూరుతుందని మంత్రులకు అధికారులు వివరించారు. ఇక్కడ భూములు, ఆస్తుల విలువలు భారీగా పెరిగాయని.. 2019–20లో హెచ్‌ఎండీఏ పరిధిలోని మొత్తం రిజిస్ట్రేషన్లలో 51% లావాదేవీలు ప్రభుత్వ నిర్ధారిత విలువలకు మించి జరిగాయని తెలిపారు. రిజిస్ట్రేషన్‌ విలువలు తక్కువ ఉండటంతో రుణాలతో ఇళ్లు కొనాలనుకునేవారికి.. తక్కువ మొత్తంలో రుణం వస్తోందని, ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు రిజిస్ట్రేషన్‌ విలువల సవరణే మార్గమని సూచించారు. దీంతో రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ వెంటనే చేపట్టాలని ఉప సంఘం సిఫారసు చేసింది. నివేదికను త్వరలోనే సీఎంకు అందించాలని నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు