ఇళ్లలోనే ఉండండి: సీఎం కేసీఆర్‌

8 Sep, 2021 04:59 IST|Sakshi

వానలు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సీఎం కేసీఆర్‌ సూచన

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. వానలు, వరద ముంపు ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా సురక్షితంగా ఉండాలి. జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తూ.. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలి. ఎన్డీఆర్‌ఎఫ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలను సిద్ధంగా ఉంచుకోవాలి. విద్యుత్‌ సరఫరా, రోడ్లు, నాలాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలి.
– సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై మంగళవారం అక్కడి నుంచే సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు.

వరద ప్రభావిత గ్రామాలు, మండలాల్లో తగిన చర్యలు చేపట్టేలా సంబంధిత శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు. నీటి పారుదల శాఖ అధి కారులు నిరంతర వరదల పరిస్థితిని సమీక్షిం చాలని, ఇతర ప్రభుత్వ శాఖలకు ఆ వివరాలను అందజేయాలని సూచించారు. ముంపు ప్రాం తాల్లో శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాలని.. ఎన్డీఆర్‌ఎఫ్, డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ దళాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా, రోడ్లు, నాలాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని.. మున్సిపల్, పంచాయతీరాజ్, రోడ్లు–భవనాలు, విద్యుత్‌ శాఖల అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ప్రజాప్రతినిధులంతా తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని.. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ, సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు.

ప్రతి జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌: సీఎస్‌
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశిం చారు. జిల్లాల్లోని అధికారులందరూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు.. వర్ష ప్రభావిత 20 జిల్లాల కలెక్టర్లతో సీఎస్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు, ఇతర జల వనరులు పూర్తిగా నిండి ఉండటంతో.. అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా చెరువు కట్టల పటిష్టతను పర్యవేక్షించాలని సూచించారు. సమీప ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. 

ఇవీ చదవండి:
తెలంగాణలో 65 వేల ఖాళీలు భర్తీ చేసేలా..
TS: రాష్ట్రానికి జ్వరం

మరిన్ని వార్తలు