కేసీఆర్‌కు కరోనా: కేటీఆర్‌, కవిత భావోద్వేగం

19 Apr, 2021 22:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు కరోనా పాజిటివ్‌ రావడం సంచలనం రేపింది. కేసీఆర్‌కు పాజిటివ్‌ రావడంతో ప్రముఖులంతా షాక్‌కు గురయ్యారు. సీఎం కేసీఆర్‌ తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు‌, కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల  కవిత భావోద్వేగానికి గురయ్యారు. గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా బారిన పడటం ఆందోళన కలిగించిం దని, ఆయన త్వరగా కోలుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆకాంక్షించారు. సీఎం కరోనా నుంచి కోలుకోవాలంటూ పలువురు రాష్ట్ర మంత్రులతోపాటు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు సందేశాలు విడుదల చేశారు.

ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌, కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ నాయకులు డాక్టర్‌ లక్ష్మణ్, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, మహమూద్‌ అలీతోపాటు రాజ్యసభ ఎంపీలు కే.కేశవరావు, సంతోష్, ఎమ్మెల్సీ కవిత, బాల్క సుమన్‌ తమ సందేశాలను ట్వీట్‌ చేశారు. సినీ నటులు చిరంజీవి, మహేశ్‌ బాబు, దర్శకుడు ఎన్‌.శంకర్, హీరోలు నాగశౌర్య, సుధీర్‌బాబు, సినీ ప్రముఖులు గోపిచంద్‌ మలినేని, ఎస్‌ఎస్‌ థమన్‌, శ్రీను వైట్ల, మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ సీఎం త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు విడుదల చేశారు.

త్వరలో కోలుకుంటారు: కేటీఆర్‌ 
తన తండ్రి, సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకి స్వల్పంగా కోవిడ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సీఎం ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సందేశాలు అందుతున్నాయి. సీఎం గట్టి మనిషి, యోధుడు. మీ అందరి ప్రార్థ్ధనలతో తప్పకుండా త్వరలో కోలుకుంటారు’’ అని ట్వీట్‌ చేశారు.

త్వరగా కోలుకోవాలి: హరీశ్‌
‘తెలంగాణ ముఖ్యమంత్రి, మనందరి ప్రియతమ నేత కేసీఆర్‌ కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు. 

‘సీఎం కేసీఆర్ గారికి స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసీఆర్ గారు త్వరగా
కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’
- కల్వకుంట్ల కవిత
 

మరిన్ని వార్తలు