దళిత సాధికారత: మేధావులకు సీఎం కేసీఆర్‌ పిలుపు 

29 Jun, 2021 08:21 IST|Sakshi

భవిష్యత్తులో కార్పస్‌ ఫండ్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, వారి జీవితాల్లో గుణాత్మక మార్పును తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఈ లక్ష్య సాధనలో దళిత మేధావి వర్గం కలిసి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పిలుపునిచ్చారు. రూ.1,200 కోట్లతో ప్రారంభించి, భవిష్యత్తులో రూ.40 వేల కోట్లతో అమలు చేయబోతున్న ‘సీఎం దళిత సాధికారత పథకం’కోసం పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని, అందుకు తగు సూచనలు, సలహాలు అందించాలని వారిని కోరారు. దళిత సామాజికవర్గ మేధావులు, ప్రొఫెసర్లు సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి దళిత సాధి కారత పథకం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. 

దేశానికి ఆదర్శంగా నిలుద్దాం.. 
‘దళిత సాధికారత పథకానికి రూ.40 వేల కోట్ల నిధులకు తోడు భవిష్యత్తులో కార్పస్‌ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నం. ఇంకా ఏమి చేయాలి ? ఎట్ల చేస్తే అట్టడుగున ఉన్న కడు పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అన్న విషయాల్లో మీ సలహాలు, సూచనలను అందించండి. ప్రత్యేకంగా ఓ రోజంతా సదస్సు నిర్వహించుకుందాం. దళిత సాధికారతను సాధించి దేశానికి ఆదర్శంగా నిలుద్దాం’ అని సీఎం వారికి విజ్ఞప్తి చేశారు. ఏ ప్రాంతంలోని సమస్యలకు ఏ విధమైన విధానాన్ని అనుసరించడం ద్వారా శాశ్వత పరిష్కారాలను చూపగలమన్న అంశంపై ఆలోచన చేయాల్సిన అవసరముందన్నారు.  

విప్లవాత్మక మార్పులకు నాంది     
‘సీఎం దళిత సాధికారత పథకం’దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకనుందని దళిత సామాజికవర్గ మేధావులు ధీమా వ్యక్తం చేశారు. మరియమ్మ లాకప్‌ డెత్‌ విషయంలో కేసీఆర్‌ తీసుకున్న చర్యలను సైతం వారు ప్రశంసించారు. దళిత సమాజంలో ఒక భరోసా ఉప్పెనలా పొంగిందని వారు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎస్సీ ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు ఆరేపల్లి రాజేందర్, ప్రొఫెసర్‌ మురళీదర్శన్, ఓయూ ప్రొఫెసర్‌ మల్లేశం, మాదిగ విద్యావంతుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్‌ చీమ శ్రీనివాస్, ఉస్మానియా యూనిర్శిటీ ఎస్సీ, ఎస్టీ బోధనేతర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి.కుమార్, బంధు సొసైటీ అధ్యక్షుడు పుల్లెల వీరస్వామి, మాదిగ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు జాన్‌ తదితరులు ఉన్నారు. 
చదవండి: కాకతీయ వర్సిటీలో పీవీ విద్యాపీఠం ఏర్పాటు చేస్తున్నాం: సీఎం కేసీఆర్

మరిన్ని వార్తలు