వ్యాక్సిన్‌ కేంద్రాలు @ 1,213 

12 Jan, 2021 05:44 IST|Sakshi

తరలింపునకు 866 కోల్డ్‌ చైన్‌ పాయింట్లు రెడీ 

మంత్రులు, కలెక్టర్లతో భేటీతో పాటు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను అన్ని పీహెచ్‌సీల పరిధిలో ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే చేసింది. 1,213 కేంద్రాల్లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు జరిగాయి. వ్యాక్సిన్‌ను తరలించేందుకు 866 కోల్డ్‌ చైన్‌ పాయింట్లను ఏర్పాటు చేశాం. వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రస్థాయిలో సీఎస్‌ ఆధ్వర్యంలోని కమిటీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది. జిల్లా, మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటయ్యాయి’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సోమవారం ప్రగతి భవన్‌ లో మంత్రులు, కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సమీక్షించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ 2 సందర్భాల్లో సీఎం వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.  

రెండు వ్యాక్సిన్లు: ‘సీరం రూపొందించిన కోవిషీల్డ్, భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ను సమర్థవంతమైన వ్యాక్సిన్లుగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాక్సిన్లనే రాష్ట్రంలో అందించాలని నిర్ణయించాం. ముందుగా ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి అనంతరం కోవిడ్‌ వ్యాప్తి నివారణలో ముందుండి పోరాడుతున్న పోలీసులు, భద్రతా బలగాలు, పారిశుధ్య సిబ్బంది తదితర ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇస్తాం. ప్రాధాన్యత క్రమంలో నిర్ణయించిన వారిని వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తీసుకోవాలి’అని సీఎం వెల్లడించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు భాగస్వాములు కావాలి అని కోరారు. 

తక్షణమే వైద్యం..: ‘వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత ఎవరికైనా రియాక్షన్‌ ఉంటే వారికి వెంటనే వైద్య చికిత్స అందించడానికి వీలుగా వ్యాక్సిన్‌ సెంటర్‌కు అనుబంధంగా ఒక గదిని, వైద్యులను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అంబులెన్స్‌ కూడా అందుబాటులో ఉంటుంది’అని కేసీఆర్‌ వివరించారు.   

>
మరిన్ని వార్తలు