త్వరలో సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన..

17 Jun, 2021 19:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో సిద్దిపేట పర్యటించనున్నారు. సిద్దిపేట జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయంతోపాటు పోలీస్ కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యలాయాలు ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు, పోలీస్‌ యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సీఎం సిద్దిపేటకు వస్తుండడంతో అధికారులతోపాటు మంత్రి హరీష్‌ రావు కూడా ఏర్పాట్లపై దృష్టి సారించారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కాగా జూన్  20న సీఎం వస్తారని ఇటీవల మంత్రి హరీష్‌ రావు ప్రకటించిన వెంటనే భవనాలను పరిశీలించడంతో భవనాల ప్రారంభం కూడా త్వరలోనే ఉంటుందని తెలుస్తుంది. 

అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్
ఇక సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఉన్నతాధికారుల ఛాంబర్లు, వివిధ శాఖలకు గదుల కేటాయింపు కొలిక్కి వచ్చింది. ఫర్నిచర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి..తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత విశాలంగా సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ భవనా నికి పేరు దక్కనున్నది. నాలుగెకరాల విస్తీర్ణంలో 62.60 కోట్లతో ఈ నూతన భవన సముదాయాన్ని నిర్మించారు. రెండంతస్తుల భవనంలో 600 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు వసతులు కల్పించారు.. 40 శాఖలకు 100 గదులను కేటాయించారు. కలెక్టర్ ఆడిషనల్ క‌లెక్టర్, డీఆర్వోతో పాటు పలువురు జిల్లా స్థాయి అదికారులకు ప్రత్యేక చాంబర్లను నిర్మించారు.

సుందరంగా నూతన పోలీస్ కమిషనరేట్..
అత్యాధునిక వసతులతో, సాంకేతికతతో నూతన పోలీస్ కమిషనరేట్ సిద్ధమవుతుంది. దుద్దెడ గ్రామ శివారులో 29 ఎకరాల్లో రూ.19 కోట్లు వెచ్చించి జిల్లా పోలీస్ కమిషనరేట్ నిర్మించారు. అత్యాధునిక హంగులతో, సాంకేతికత, వసతులతో ఈ భవనాన్ని నిర్మించారు.. నూతన కమిషనరేట్ ప్రాంగణంలోనే సీపీ,ఆడిషనల్ డీసీపీలు స్థానిక ఎసీపీకి ప్రత్యేక చాంబర్లు నిర్మించారు. అదే విధంగా సిద్దిపేట పట్టణంలో నూతనంగా ఎమ్మెల్యే క్యాంపును నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా  ఈ నెల 20న  ప్రారంభించడానికి  ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

మరిన్ని వార్తలు