10.10 తర్వాత రోడ్లపై ఎవరూ కనిపించొద్దు: సీఎం కేసీఆర్

21 May, 2021 20:46 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : తెలంగాణలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని, డీజీపీ, కలెక్టర్లు, ఉన్నతాధికారులు లాక్‌డౌన్‌ను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఉ.10.10 తర్వాత రోడ్లపై ఎవరూ కనిపించొద్దని అన్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్‌ వరంగల్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని, అన్ని జిల్లాల కలెక్టర్లు,డీజీపీ, ఎస్పీ, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితి ఏవిధంగా ఉంది? కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కార్యాచరణ ఏమిటి?  అని అడిగి తెలుసుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘ ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి. వరంగల్ సెంట్రల్‌ జైలును మరో చోటకు తరలించి ఓపెన్‌ జైలుగా మారుస్తాం. సెంట్రల్‌ జైలు స్థానంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం. కోవిడ్ వార్డులో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది సమస్యలపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాం. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, కూరగాయల వ్యాపారులు, సేల్స్‌మెన్స్‌ కోసం వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.

యాదాద్రి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో కరోనా కేసులు తగ్గడంలేదు. సరిహద్దు రాష్ట్రాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జిల్లాల్లో మందుల సరఫరా ఎలా ఉంది?, ఆక్సిజన్ సరఫరా ఎలా ఉంది?. మొదటి జ్వర సర్వేకు కొనసాగింపుగా.. రెండో విడత కూడా ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలి. హాస్పిటళ్ల పరిశుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కోవిడ్ ఆస్పత్రుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తీసేయడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి’’ అని అధికారులను  ఆదేశించారు. 

మరిన్ని వార్తలు