అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది: సీఎం కేసీఆర్‌

20 Jan, 2021 03:54 IST|Sakshi
మంగళవారం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న కేసీఆర్‌ దంపతులు

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి వినియోగంలోకి రావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం

సతీసమేతంగా కాళేశ్వరంలో ముఖ్యమంత్రి పర్యటన

ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం దంపతులు

అనంతరం గోదావరి జలాలకు పుష్పాభిషేకం

ఆపై హెలికాప్టర్‌లో ప్రాజెక్టు విహంగ వీక్షణం

ప్రజాప్రతినిధులతో నిర్మాణ జ్ఞాపకాలు పంచుకున్న సీఎం

సాక్షి , వరంగల్‌: తెలంగాణ రైతుల కలలను సాకారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందని సీఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రైతులు సాగునీటి కోసం గోస పడొద్దనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. వేసవిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలోనూ ఇంజనీర్లు, అధికారులు, వేలాది మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చేసిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అనుకున్న సమయంలో అనుకున్న విధంగా ప్రాజెక్టు పూరై్త నీటి పంపింగ్‌ కూడా నిరాటంకంగా జరుగుతుండటంపై సీఎం సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కేసీఆర్‌ మంగళవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం చేరుకున్నారు. హెలీప్యాడ్‌ నుంచి ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గం ద్వారా తన సతీమణి శోభతో కలసి ఆలయానికి చేరుకొని కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ముందుగా గణపతిపూజ చేసిన కేసీఆర్‌ దంపతులు.. గర్భగుడిలో ప్రత్యేకంగా మహాన్యాసకపూర్వక రుద్రాభిషేక పూజలను పంచామృతాలతో నిర్వహించారు. అనంతరం శ్రీశుభానందదేవి (పార్వతి) అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం దంపతులకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు.  చదవండి: (ప్రధాని బొమ్మను పెట్టాల్సిందే)


మంగళవారం మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీ సందర్శన సందర్భంగా గోదావరి జలాలకు  సీఎం కేసీఆర్‌ దంపతుల పుష్పాభిషేకం. చిత్రంలో మంత్రులు గంగుల, ఎర్రబెల్లి, కొప్పుల

అనంతరం మంత్రులు, ఇతర నాయకులు, అధికారులతో కలసి సీఎం దంపతులు గోదావరి జలాలకు పుష్పాభిషేకం చేశారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఏరియల్‌ వ్యూ (విహంగ వీక్షణం) ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన ఆయన మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఎదురైన అనుభవాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్, డీజీపీ, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో పంచుకున్నారు.

సముద్రాలను తలపిస్తున్న బ్యారేజీలు...
‘సాగునీరు లేక తెలంగాణ రైతాంగం దశాబ్దాల తరబడి గోస పడింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా దక్కాలంటే రైతులు రెండు పంటలను సమృద్ధిగా పండించేలా సాగునీరు అందించి తీరాలని మొదట్లోనే నిర్ణయించుకున్నాం. అటు ప్రాణహిత, ఇటు గోదావరి రెండు నదుల నీళ్లు కలిసిన తర్వాత బ్యారేజీ నిర్మాణం చేపడితే ఎక్కువ కాలంపాటు కావలసినంత నీటిని పంపింగ్‌ చేయవచ్చని వ్యూహం రూపొందించాం. వ్యాప్కోస్‌తో శాస్త్రీయంగా సర్వే నిర్వహించి మేడిగడ్డ పాయింట్‌ వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో దాదాపు 100 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించడం వల్ల 7 నెలలపాటు నీటిని పంపింగ్‌ చేయవచ్చని అంచనా వేశాం. అనుకున్నది అనుకున్నట్లు జరుగుతోంది. 99.7 మీటర్ల ఎత్తులో 16.17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిర్మాణాలన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగాయి’అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం ప్రాజెక్టు జ్ఞాపకాలను పంచుకున్నారు.  చదవండి: (వినయ్‌రెడ్డి మనోడే!)

‘నీటి పంపింగ్‌ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగుతోంది. మేడిగడ్డ పాయింట్‌ నుంచి 54 కిలోమీటర్ల వరకు ప్రాణహితలో, 42 కిలోమీటర్ల వరకు గోదావరిలో నీరు నిల్వ ఉండటంతో జలకళ ఉట్టి పడుతోంది. బ్యారేజీలు సముద్రాలను తలపిస్తున్నాయి. ఏ సమయం ఎట్ల వచ్చినా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్‌ఎండీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ఏటా నీరందుతుంది.


ప్రాజెక్టు వద్ద అధికారులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు తదితరులు 

నిజాం సాగర్‌కు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీరందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవసరమైన పక్షంలో ఎస్సారెస్పీకి కూడా ఈ ప్రాజెక్టు నుంచే నీటి పంపింగ్‌ చేయడానికి ఏర్పాట్లు చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్ఫూర్తితోనే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన తుపాకులగూడెం బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీంటినీ త్వరగా పూర్తిచేసి రైతుల సాగునీటి గోసను శాశ్వతంగా రూపుమాపాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.

అధికారులకు అభినందన..
‘మేడిగడ్డ బ్యారేజీ, తుపాకులగూడెం బ్యారేజీ, దుమ్ముగూడెం బ్యారేజీలకు సంబంధించి కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్‌ రూల్స్‌ రూపొందించాలి. సమయానుగుణంగా రూల్స్‌ను అమలు చేయాలి’అని సీఎం కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంలో కృషి చేసిన నీటిపారుదల శాఖ అధికారులు, వర్కింగ్‌ ఏజెన్సీలు, ఇతర శాఖల ఉద్యోగులను కేసీఆర్‌ అభినందించారు. ప్రస్తుతం బ్యారేజీల వద్ద పూర్తిస్థాయిలో నీటి నిల్వలున్నాయని, ఈ ఎండాకాలమంతా ఈ నీటితో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, నింపాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులవారీగా ఆపరేషన్‌ రూల్స్‌ రూపొందించి అమలు చేయాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన స్ఫూర్తితోనే రాష్టంలో చేపట్టిన ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పురాణం సతీశ్, నారదాసు లక్ష్మణ్‌రావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్‌రావు, నల్లా వెంకటేశ్వర్లు, భూపాలపల్లి, రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, నడపల్లి దివాకర్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్లు పుట్టా మధు, గండ్ర జ్యోతి పాల్గొన్నారు.

గోదావరిని చూసి పులకించిన ముఖ్యమంత్రి
కాళేశ్వరాలయంలో పూజల అనంతరం ప్రగతిరథం బస్సులో మంత్రులతో కలసి కేసీఆర్‌ దంపతులు గోదావరి వద్దకు వెళ్లారు. గోదావరి నిండుగా ఉండటం చూసి కేసీఆర్‌ పులకించిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో నిండుగా ఉందని అధికారులతో అన్నారు. గతంలో వచ్చినప్పుడు కాలినడకన ఇసుకలో కిలోమీటర్‌ మేర నడిచే వాళ్లమని గుర్తుచేసుకున్నారు. నిత్యం భక్తుల రద్దీ ఉంటుందా? ఘాట్‌లో భక్తులు స్నానాలు చేస్తున్నారా? అప్పటికీ, ఇప్పటికీ భక్తుల సంఖ్య పెరిగిందా అంటూ పక్కనే ఉన్న అర్చకులతో వాకబు చేశారు. గతంలో కంటే భక్తుల రద్దీ పెరిగిందని, నిత్యం వేల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నట్లు వారు బదులిచ్చారు. ఆ తర్వాత గోదావరి మాతకు ప్రత్యేకంగా పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, పాలను సమర్పించిన కేసీఆర్‌ దంపతులు.. నదిలో నాణేలను వేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టాం. 
50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలోనూ వేలాది మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. భూసేకరణతోపాటు వివిధ క్రాసింగ్‌లకు సంబంధించిన అంశాలను అధికారులు సమయోచితంగా, సమర్థంగా పరిష్కరించారు. మొత్తంగా రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఆవశ్యకమైన ప్రాజెక్టు నిర్మాణం పూరై్త వినియోగంలోకి రావడంతో సంతోషంగా ఉంది. తెలంగాణ రైతుల కల నెరవేరినందుకు, సాగునీటి సమస్య తీరుతున్నందుకు సంతృప్తిగా ఉంది.

మరిన్ని వార్తలు