ఆదివాసీ, గిరిజనానికి ప్రత్యేక ఆహ్వానం

16 Sep, 2022 01:57 IST|Sakshi
సేవాలాల్‌ బంజారా భవన్‌, కొమురంభీమ్‌ ఆదివాసీ భవన్‌ 

రేపు జంట భవనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

హాజరవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులకూ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఆదివాసీ, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించిన జంట భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేపు(ఈనెల 17న) ప్రారంభించనున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఈ ఏర్పాట్లను అత్యంత ఘనంగా చేపట్టింది. భవనాల ప్రారంభోత్సవానికి ఆయా వర్గాల ప్రజలను ఆహ్వానిస్తోంది. గిరిజన గూడేలు, ఏజెన్సీ గ్రామాలు, తండాల్లోని పంచాయతీలకు ప్రత్యేకంగా ఆహ్వానాలను పంపింది.

ఆదివాసీ తెగలు, గిరిజన పౌరులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అందులో సూచించింది. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా హైదరాబాద్‌లో జంట భవనాల ప్రారంభోత్సవానికి హాజరు కావాలని సూచి స్తూ, ఆయా ఉద్యోగులకు ఆన్‌డ్యూటీ సౌకర్యాన్ని సైతం కల్పించింది. జంట భవనాల ప్రారంభోత్సవం అనంతరం ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగే గిరిజన మహాసభను విజ యవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం పిలుపునిచ్చింది.

ఒక్కో భవనానికి రూ. 22 కోట్లు...
మహానగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్‌లో ఈ రెండు భవనాల కోసం ఎకరా స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. నిర్మాణంకోసం రూ.44 కోట్లు కేటాయించింది. ఓక్కో భవనానికి రూ.22 కోట్లు చొప్పున ఖర్చు చేసింది. ఒక్కో భవనంలో సగటున వెయ్యి మంది సమావేశమయ్యేందుకు వీలుగా నిర్మించింది. ఇక ఈ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు అక్కడే వసతి కల్పించేలా గదులు ఉన్నాయి.

ఆయా భవనాల్లోకి ప్రవేశించగానే వారి సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే బొమ్మలు, కళాత్మక చిత్రాలను కూడా ఏర్పాటు చేసింది. గతేడాది సెప్టెంబర్‌ నాటికే భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమయం కోసమే గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈనెల 17న ముహూర్తం కుదరడంతో.. రేపు ఆ రెండు భవనాలు ప్రారంభం కానున్నాయి.

మరిన్ని వార్తలు