KCR: బంగారు తెలంగాణ వచ్చేదాకా విశ్రమించను

2 Jun, 2021 04:53 IST|Sakshi

పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో సాధించుకున్నాం: కేసీఆర్‌

సమైక్య రాష్ట్రంలో విస్మరించినా.. దార్శనికతతో దిద్దుబాటు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు తన మీద ఉంచిన విశ్వాసం, అభిమానమే కొండంత ధైర్యమని.. ప్రజలిచ్చిన భరోసాతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేంత వరకు తాను విశ్రమించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సమైక్యరాష్ట్రంలో విస్మరించిన రంగాలను ఒక్కొక్కటిగా ఓపిక, దార్శనికతతో అవాంతరాలు ఎదురైనా సరిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు.తెలంగాణ రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

"అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశం గర్వించే రీతిలో నిలబెట్టుకున్నం. ఏడేండ్లలోనే దృఢమైన పునాదులతో సుస్థిరత చేకూరడం సంతోషంగా ఉంది. ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సాగు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం రోడ్లు తదితర మౌలిక వసతులను స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలతో చేస్తున్నం. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైనా అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం.


తెలంగాణలో 90శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందినవారే ఉండటంతో వారి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నం. ప్రజల ఆకాంక్షలకు కార్యరూపమిచ్చి, అభివృద్ధి ద్వారా అమరుల త్యాగాలకు నివాళి అర్పించాలనే స్ఫూర్తి ఉంది. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కళాకారులు, ఇతర కులవృత్తులతో పాటు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలబడింది. తెలంగాణ రైతాంగాన్ని కాపాడి సాగుకు పునరుజ్జీవం కల్పించి.. దేశానికే రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయాన్ని స్థిరీకరించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశాం."

మరిన్ని వార్తలు