లండన్‌ థేమ్స్‌లా మూసీ అభివృద్ధి

20 Jan, 2024 02:36 IST|Sakshi
థేమ్స్‌ నది పాలక మండలి సభ్యులతో సీఎం రేవంత్‌ 

నది పునరుజ్జీవం, అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు ప్రణాళిక

విజన్‌ 2050కు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం

లండన్‌ పర్యటనలో థేమ్స్‌ నది పాలక మండలితో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయని.. హైదరాబాద్‌కు కూడా అటువంటి ప్రత్యేకత ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అటు మూసీ నది వెంబడి, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ, ఉస్మాన్‌సాగర్‌ వంటి జలాశయాలు కేంద్రంగా హైదరాబాద్‌ అభి వృద్ధి చెందిందని చెప్పారు.

మూసీకి పునర్వై భవం తీసుకొస్తే.. నది, సరస్సులతో హైదరాబాద్‌ మరింత శక్తివంతంగా తయారవుతుందని తెలిపారు. మూసీ పునరుజ్జీవం, రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు రూపక ల్పనలో భాగంగా.. ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్‌ బృందం బ్రిటన్‌లోని లండన్‌లో పర్యటించింది. ఆ నగరంలోని థేమ్స్‌ నదిని పరిశీలించి.. దానిని నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. తర్వాత థేమ్స్‌ నది పాలక మండలి, పోర్ట్‌ ఆఫ్‌ లండన్‌ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు సమా వేశమై చర్చించారు. విజన్‌ 2050కి అనుగుణంగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టనున్నామని, దీనికి సహకరించాలని సీఎం రేవంత్‌  కోరారు.

అభివృద్ధితోపాటు సంరక్షణకు ప్రాధాన్యం
దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్‌ నదీ తీరం వెంట చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ సియాన్‌ ఫోస్టర్, పోర్ట్‌ ఆఫ్‌ లండన్‌ అథారిటీ హెడ్‌ రాజ్‌కెహల్‌ లివీ తదితరులు సీఎం రేవంత్‌ బృందానికి వివరించారు. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, అనుసరించిన విధానాలను తెలిపారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నది సంరక్షణకు ప్రాధాన్యమి చ్చినట్టు స్పష్టం చేశారు.

నదీ జలాలను సుస్థిరంగా ఉంచటంతోపాటు స్థానికులకు ఎక్కువ ప్రయోజన ముండే రెవెన్యూ మోడల్‌ను ఎంచుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు తాము పూర్తిగా సహకరిస్తా మని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్‌ లైన్, వివిధ సంస్థల భాగ స్వామ్యంపై చర్చించారు. భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎం రేవంత్‌పాటు సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భారత సంతతి బ్రిటన్‌ ఎంపీలతో రేవంత్‌ భేటీ
దావోస్‌ పర్యటన ముగించుకుని లండన్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి భారత సంతతి ఎంపీలతో సమావేశమయ్యారు. ఓల్డ్‌ వెస్ట్‌ మినిస్టర్‌ పార్లమెంటు భవనంలో లేబర్‌ పార్టీకి చెందిన ఎంపీ వీరేంద్రశర్మ ఆతిథ్యమిచ్చిన ఈ భేటీలో.. ఏడుగురు బ్రిటన్‌ ఎంపీలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. భారత్‌–బ్రిటన్‌ దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్యబంధం ఉందన్నారు. ఇరు దేశాలు మహాత్మాగాంధీ సందేశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు