జీఓ 46 రద్దు ఇప్పటికి లేదు

13 Feb, 2024 02:44 IST|Sakshi
సమీక్షలో సీఎం రేవంత్, శ్రీధర్‌ తదితరులు

కొత్త నోటిఫికేషన్లపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం నిర్ణయం  

ఇప్పటికే నియామక ప్రక్రియ పూర్తయినందున 

జీఓ నం.46 రద్దు అసాధ్యమన్న అధికారులు 

అధికారుల సూచన మేరకే ముందుకెళ్లాలని రేవంత్‌ నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో చర్చించి కేబినెట్‌ సబ్‌ కమిటీ ద్వారా జీవో46 రద్దుపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలంచాలని సీఎంకు అధికారులు సూచించడంతో రేవంత్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోలీస్‌ నియామకాల్లో జీవో నెం.46 రద్దు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు జూబ్లీహిల్స్‌ లోని తన నివాసంలో హైపవర్‌ కమిటీతో రేవంత్‌ రెడ్డి సోమవారం రాత్రి సమావేశమయ్యారు.

మంత్రి శ్రీధర్‌ బాబు, అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌ రెడ్డి, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రంజిత్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా తదితరులు  ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్‌ జనరల్‌ సలహా సూచనలను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. 

15,750 పోస్టులకు  నియామక పత్రాలు అందించడమే.. : 
పోలీస్‌ నియామక ప్రక్రియ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్‌ జనరల్‌ అధికారులు తేల్చి చెప్పారు. ’’మార్చి 2022లో పోలీసు నియామకాలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అక్టోబర్‌ 4, 2023 నాటికి 15,750 పోస్టులకు నియామక ప్రక్రియ పూర్తయినా.. కోర్టు కేసుతో ప్రక్రియ పెండింగ్‌ లో పడింది’’అని అధికారులు తెలిపారు.

అయితే సెలక్షన్‌ ప్రాసెస్‌ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని సీఎం దృష్టికి అధికారులు తెచ్చారు. సెలక్షన్‌ ప్రాసెస్‌ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్‌ జనరల్, అధికారులు స్పష్టం చేశారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎంకు అధికారులు సూచించారు.  

జీఓ 46 ప్రకారం జనాభా ప్రాతిపదికన పోస్టుల కేటాయింపు ఉండడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ కానిస్టేబుల్‌ పోస్టులు స్థానికులకు దక్కుతున్నాయనే వాదనను కొందరు వినిపిస్తున్నారు. ఫలితంగా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అయితే నియామక ప్రక్రియ చివరి దశలో ఉన్నందున ఇప్పుడు జీఓ 46 ర ద్దు అసాధ్యం అన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.

whatsapp channel

మరిన్ని వార్తలు