శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన సీఎండీ ప్రభాకర్‌

26 Aug, 2020 18:53 IST|Sakshi

సాక్షి, శ్రీశైలం: జెన్‌కో, ట్రాన్స్‌కో  సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ రావు శ్రీశైలం ప్రమాద స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ, ‘దురదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరిగింది కానీ పెద్దగా ఆస్తి నష్టం జరుగలేదు. 4వ యూనిట్ లో నష్టం ఎక్కువగా జరిగింది. 1,2 యూనిట్స్ బాగానే ఉన్నాయి, 5 కూడా బాగానే ఉంది. 6వ యూనిట్ లో ప్యానెల్ దెబ్బ తింది. ఆరవ యూనిట్‌లో ప్రారంభమయిన మంటలు మిగతా యూనిట్లుకు అంటుకున్నాయి, నాల్గో యూనిట్ పూర్తిగా కాలిపోయింది. అందరూ అన్నట్లు వేల కోట్ల నష్టం జరుగలేదు, దురదృష్టవశాత్తు ప్రాణ  నష్టం జరిగింది. అదే  చాలా బాధాకరం. 

త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభిస్తాం. విద్యుత్ ఉద్యోగుల భద్రతకు మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం ప్లాంటులో జరిగిన అగ్ని ప్రమాదం లాంటి దుర్ఘటనలను మళ్లీ జరగకుండా ఏమి చేయాలో అన్నీ చేస్తాం. ఉద్యోగులు ఏమాత్రం అభద్రతా భావానికి లోనుకాకుండా మరింత అంకితభావంతో పనిచేసి, తెలంగాణ ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంస్థల ఉద్యోగులు యావత్ దేశం దృష్టిని ఆకర్షించే ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. తెలంగాణ ప్రజలకు విద్యుత్ ఉద్యోగులపై ఎంతో విశ్వాసం, అభిమానం ఉన్నాయి. వాటిని నిలుపుకోవడం ముఖ్యం.

ప్లాంటులో ప్రమాదం జరిగి ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం పట్ల తెలంగాణ ప్రజలంతా దిగ్భాంతికి గురయ్యారు. ప్రజలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా మనమంతా మరోసారి పునరంకితమై పనిచేయాలి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. వారిని ఎలా ఆదుకోవాలనే విషయాన్ని చాలా తీవ్రంగా పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు. తన సోదరుడు శ్రీనివాసరావు మరణించాడన్న వార్త తెలిసిన తరువాత కూడా ఆయన ప్లాంటులో పర్యటించారు. తన సొంత అన్న మరణించిన దుఃఖాన్ని పంటి బిగువన దిగమింగుకుని తమకు ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రభాకర్ రావుకు పలువురు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఆయన సోదరుడి మరణం పట్ల విచారం, సానుభూతి వ్యక్తం చేశారు. 

చదవండి: ట్విస్ట్‌ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం


 

మరిన్ని వార్తలు