విదేశీ బొగ్గుతో.. ‘విద్యుత్‌’ మోత!

30 May, 2022 01:11 IST|Sakshi

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు దిగుమతులను తప్పనిసరి చేసిన కేంద్రం

విదేశీ బొగ్గుకు టన్నుకు రూ.20–40 వేల మధ్య ధర

సింగరేణి బొగ్గు రేటు రూ.3–5 వేలు మాత్రమే..

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తప్పనిసరిగా బొగ్గు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో.. విద్యుత్‌ ధరల మోత మోగనుంది. ప్రధానంగా కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాల (సీజీఎస్‌)తోపాటు ప్రైవేటు విద్యుత్‌ కేంద్రాల నుంచి నుంచి రాష్ట్రానికి సరఫరా అవుతున్న విద్యుత్‌ ధరలు పెరగనున్నాయి. దీనితో విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లతోపాటు సామాన్య వినియోగదారులపైనా ప్రభావం పడనుంది.

పదింతల ధరతో..
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 10శాతం బొగ్గును 90శాతం దేశీయ బొగ్గుతో కలిపి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నాణ్యత ఆధారంగా సింగరేణి బొగ్గు ధరలు టన్నుకు రూ.3,000–5,000 వరకు ఉండగా.. దిగుమతి చేసుకునే బొగ్గు ధరలు టన్నుకు రూ.20వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటున్నాయి. విదేశీ బొగ్గు కారణంగా ఒక్కో యూనిట్‌ విద్యుత్‌ ధర అదనంగా 9–10 పైసలు పెరుగుతుందని రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు అంచనా వేశాయి. మొత్తంగా ఏడాదికి రూ.630 కోట్లు భారం పడుతుందని పేర్కొన్నాయి.

మొత్తం రూ. 7,173 కోట్లు
రాష్ట్రానికి దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా.. ఎన్టీపీసీ సహా ఇతర కేంద్ర విద్యుత్‌ కేంద్రాల నుంచి 2,650 మెగావాట్లు, సెమ్బ్‌కార్ప్‌ అనే ప్రైవేటు సంస్థ నుంచి 840 మెగావాట్లు థర్మల్‌ విద్యుత్‌ రాష్ట్రానికి సరఫరా అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో కేంద్ర విద్యుత్‌ కేంద్రాల నుంచి 17,116.91 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి రాష్ట్ర డిస్కంలకు ఈఆర్సీ అనుమతిచ్చింది.

ఈ విద్యుత్‌కు స్థిర ధర వ్యయం రూ.2,112.01 కోట్లు, చర వ్యయం రూ.4,601.41 కోట్లు కలిపి.. మొత్తం రూ.6,713.42 కోట్లు వ్యయం అవుతుందని ఈఆర్సీ అంచనా వేసింది. 10శాతం దిగుమతైన బొగ్గును వాడితే చర వ్యయం అదనంగా రూ.460.14 కోట్లు పెరిగి.. మొత్తం వ్యయం రూ.7,173.56 కోట్లకు చేరుతుంది.

ఇక సెమ్బ్‌కార్ప్‌ ఎనర్జీ నుంచి 7,353.58 ఎంయూ విద్యుత్‌ కొనుగోళ్లకు ఈఆర్సీ అనుమతిచ్చింది. ఇందుకు రూ.1,471.29 కోట్ల స్థిర వ్యయం, రూ.1,697.44 కోట్ల చర వ్యయం కలిపి మొత్తం రూ.3,168.7 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. దిగుమతి చేసుకున్న బొగ్గు వాడితే చర వ్యయం అదనంగా రూ.169.74 కోట్లు పెరిగి.. మొత్తం వ్యయం రూ.3,338.44 కోట్లు అవుతుంది.

రేపటితో ముగియనున్న డెడ్‌లైన్‌!
దేశంలోని అన్ని థర్మల్‌ ప్లాంట్లు మే 31లోగా బొగ్గు దిగుమతుల కోసం ఆర్డర్‌ చేయాలని, జూన్‌ 15 నాటికి ఆ బొగ్గు విద్యుత్‌ కేంద్రాలకు వచ్చి చేరాలని కేంద్రం గడువు విధించింది. రాష్ట్రంలో 4,042.5 మెగావాట్ల తెలంగాణ జెన్‌కో, 1,200 మెగావాట్ల సింగరేణి, 2,600 మెగవాట్ల ఎన్టీపీసీ–రామగుండం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలున్నాయి. సింగరేణి బొగ్గు లభ్యత పుష్కలంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ జెన్‌కో, సింగరేణి సంస్థ బొగ్గు దిగుమతులు చేసుకోబోమని ఇప్పటికే కేంద్రానికి తేల్చి చెప్పాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ఎన్టీపీసీ బొగ్గు దిగుమతులు చేసుకోనుంది.

విద్యుత్‌ స్థిర, చర వ్యయాలేంటి ?
థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి అయ్యే స్థిర, చర వ్యయాలను కలిపి యూనిట్‌ విద్యుత్‌ ధరను ఖరారు చేస్తారు. విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు కోసం పెట్టిన పెట్టుబడులను/పెట్టుబడి రుణాలను వడ్డీతో సహా కలిపి స్థిర వ్యయం పేరుతో రాబట్టుకుంటారు. విద్యుదుత్పత్తికి వాడే బొగ్గు, ఇతర ఖర్చులు, నిర్వహణ వ్యయాలను చర వ్యయం కింద లెక్కించి వసూలు చేస్తారు.  

మరిన్ని వార్తలు