సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

13 Jul, 2022 01:05 IST|Sakshi
కొత్తగూడెంలోని జీకే ఓసీలో చేరిన వర్షపు నీరు   

సింగరేణి(కొత్తగూడెం)/గోదావరిఖని: ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో రోజుకు 1.24లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాలు ప్రారంభమైన రెండుమూడ్రోజుల్లో నామమాత్రంగా బొగ్గు ఉత్పత్తి సాగినా, ఆ తర్వాత ఓవర్‌బర్డెన్‌ వెలికితీత పూర్తిగా నిలిచిపోయింది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని 25 భూగర్భగనులు, 20 ఓపెన్‌కాస్ట్‌ (ఓసీ) గనుల్లో వర్షాకాలం కారణంగా తగ్గించిన లక్ష్యం మేరకు రోజుకు 1.84 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ, ఓసీల్లో 45 వేల టన్నులు, భూగర్భగనుల్లో 15 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది.

సింగరేణి వ్యాప్తంగా రోజుకు 14 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ తొలగింపు కూడా స్తంభించిపోయింది. కొత్తగూడెం ఏరియా నుంచి రోజుకు సుమారు 32 వేల టన్నుల బొగ్గు రవాణా జరగాల్సి ఉండగా, రోజుకు 8 వేల టన్నుల బొగ్గునే రవాణా చేస్తున్నారు. మొత్తంగా గత వారం నుంచి సింగరేణి పరిధిలో 9.92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లగా, వారంలో రూ.300 కోట్ల మేర ఆదాయం మేర నష్టం జరిగినట్లు చెబుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 730 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు