100 కోట్ల పందెం కోడి

16 Jan, 2021 09:05 IST|Sakshi
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడిచర్లలో పోలీసులు స్వాధీనం చేసుకున్న పందెం కోళ్లు

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కోడి పందేలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్‌ శివార్లలో మూడు రోజుల పాటు కోడి పందేలు జోరుగా సాగాయి. ఈ సంక్రాంతికి అనేక కారణాల నేపథ్యంలో నగరంతో పాటు ఇతర జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనా ప్రభావంతో పాటు ఏపీ హైకోర్టు ఆదేశాలు, కోడి కత్తుల తయారీ కేంద్రాలు, విక్రేతలపై దాడులు.. వెరసి అక్కడకు వెళ్లే వారి సంఖ్య 20 శాతానికి పడిపోయింది. దీంతో రాష్ట్రంలోనే పందేల నిర్వహణకు కొందరు నడుంకట్టారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్‌ అర్బన్, రూరల్, భూపాలపల్లి, ములుగు... ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలైన భద్రాచలం ఏజెన్సీ, దుమ్ముగూడెం, మారాయిగూడెం, హైదరాబాద్‌ శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా బిర్రులు పుట్టుకొచ్చాయి. ఆయా చోట్ల కోడి పందేల నిర్వహణకు బిర్రులు ఏర్పాటు చేసిన నిర్వాహకులు పార్కింగ్, ఎంట్రీ ఫీజులు నిర్ణయించారు. పబ్బుల్లో మాదిరిగా ఫీజు చెల్లించిన వారికి చేతిపై ప్రత్యేక మార్కులు వేస్తూ బిర్రుల్లోకి అనుమతించారు. కొన్ని రహదారుల్లో ఈ పందెం రాయుళ్లు, సందర్శకుల తాకిడితో ట్రాఫిక్‌ జామ్‌ కూడా అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  

చెక్‌ పోస్టులకు దీటుగా ‘పోర్టర్లు’... 
ఈ పరిస్థితిని గమనించిన పోలీసులు రాష్ట్రంలో కోడి పందేలకు ఆస్కారమున్న ప్రాంతాలను గుర్తించారు. వీటిని అడ్డుకునే వ్యూహంలో భాగంగా బిర్రులకు దారితీసే మార్గాల్లో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నుంచి వాహనాలను తనిఖీ చేస్తూ కోడి పుంజులు, నగదుతో వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. అయితే వీరి తనిఖీలకు ఇతర ప్రాంతాల వారు చిక్కకుండా ఉండేందుకు స్థానికుల్లో కొందరు ‘పోర్టర్ల’అవతారమెత్తారు. ఒక్కో పుంజుకు రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తూ దొడ్డిదారిన బిర్రుల వద్దకు చేర్చారు. చెక్‌ పాయింట్లకు కాస్త దూరంలో కాపుకాసిన ఈ పోర్టర్లు ఆ దారిలో వస్తున్న వాహనాల నంబర్ల ఆధారంగా గుర్తిస్తారు. ఆయా వాహనాల్లోని వారికి చెక్‌ పాయింట్‌ విషయం చెప్పి.. వారి నుంచి నగదు, పుంజును తీసుకుని బిర్రు వద్దకు చేర్చారు. మొత్తానికి ఈసారి రాష్ట్రంలోని అనేక బిర్రుల్లో నగరవాసుల సందడి కనిపించింది. 


ఛత్తీస్‌గఢ్‌లోని మారాయిగూడెం సమీపంలో పందేల స్థావరం వద్ద పార్కింగ్‌ చేసిన కార్లు 

పలువురి అరెస్టు... 
గురువారం దుమ్ముగూడెం పరిధిలోని పెద్ద బండిరేవు గ్రామంలో దాడి చేసిన పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మియాపూర్‌లో పోలీసులు ఏడుగురు పందెంరాయుళ్లను పట్టుకున్నారు. 

కోడి పందేల జాతర..
భద్రాచలం/అశ్వారావుపేట: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు జాతరలా మారాయి. భద్రాచలం ఏజెన్సీలోని దుమ్ముగూడెం మండలం, సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని మారాయిగూడెంలో దర్జాగా పందేలు నిర్వహించారు. పందేలు భద్రాచలం, చుట్టుపక్కల ప్రాంతాల సూత్రధారుల కనుసన్నల్లోనే జరిగాయి. దుమ్ముగూడెం మండలంలో పోలీసులకు తెలియకుండా కొన్ని గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించినట్లు తెలుస్తోంది. బిర్రుల చుట్టు పక్కల ఏర్పాటు చేసిన, పేకాట, మూడు ముక్కలాట, గుండ్రాట, బొమ్మా బొరుసు ఆటల్లో వేల రూపాయల్లో డబ్బు పోగొట్టుకుని జేబులు గుల్లచేసుకుంటున్నారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలకు ఆనుకుని ఏపీ లోని జీలుగుమిల్లి, చింతలపూడి, కుక్కునూ రు, వేలేరుపాడు మండలాలు ఉండటంతో ఎక్కడివారు అక్కడే సరిహద్దు మండలాలను దాటేసి జోరుగా కోడిపందేల్లో పాల్గొన్నారు.

వినోదం, ఆహ్లాదం కోసమే..
‘పందేలు ఏ స్థాయిలో కాసినా అది డబ్బు కోసం మాత్రంకాదు.. ఆనందం కోసం మాత్రమే. నిత్యం ఉరుకులు పరుగుల జీవితం. ఈసారి కరోనాతో ఎటూ వెళ్లలేకపోయాం. సంక్రాంతికి ప్రతి ఏడాది ఆంధ్రాకు వెళ్లేవాళ్లం. ఈసారి ఆ అవకాశం లేకపోవడంతో కోడి పందేల కోసం కుటుంబంతో సహా భూపాలపల్లికి వెళ్లాం. పుంజుల్ని పాతబస్తీలోని బార్కస్‌ ప్రాంతంలో కొనుగోలు చేశాం. పోలీసుల దృష్టిలో పడకుండా ఉండేందుకు స్థానిక యువకులు సహకరించారు’.     
– నగరానికి చెందిన ఓ పందెం రాయుడు  

మరిన్ని వార్తలు