మళ్లీ చలి..చలి.. రానున్న మూడు రోజులు తగ్గనున్న ఉష్ణోగ్రతలు

5 Feb, 2022 03:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. రెండ్రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. మారిన వాతావరణ పరిస్థితులతో రానున్న మూడ్రోజుల పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదు కానుంది. రాష్ట్రంపై ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగు తోంది. ఇది నైరుతి బిహార్‌ నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భల మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

దీంతో శని, ఆది, సోమవారాల్లో నారాయణపేట్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మిగతా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మొత్తంగా సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ మేర తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 33.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కాగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని వెల్లడించింది. 

మరిన్ని వార్తలు