మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌లో కోల్డ్‌వార్‌.. మంత్రి మల్లారెడ్డిపై కేటీఆర్‌ దగ్గరకు ఎమ్మెల్యే పంచాయితీ!

19 Dec, 2022 14:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మేడ్చల్‌ ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు ఈ మేరకు సోమవారం భేటీ అయినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి వైఖరిపై రగిలిపోతున్నారు ఆ నలుగురు.. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని యత్నిస్తున్నారు. 

మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, జిల్లా పదవులన్నీ తీసుకెళ్లిపోయారని ఆ నలుగురు మండిపడుతున్నారు. ఈ మేరకు ఉప్పల్‌, కూకట్‌పల్లి, శేరిలింగం పల్లి ఎమ్మెల్యేలు.. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో భేటీ అయ్యారు. మల్లారెడ్డిపై అసమ్మతితోనే ఈ భేటీ నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. నామినేటెడ్‌ పోస్టులు మల్లారెడ్డికి సంబంధించిన అనుచరణ గణానికే ఇప్పించుకుంటున్నారని, మేడ్చల్‌ మార్కెటింగ్‌ కమిటీ పోస్టుపై విషయంలో వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్ని పోస్టులు ఒకే నియోజకవర్గానికి వెళ్లిపోయాయి. జిల్లా పదవులన్నీ మంత్రి తీసుకెళ్లారు. మంత్రి మల్లారెడ్డి మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు.  ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఈ నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. 

ప్రభుత్వం, పార్టీ తీరుపై కాకుండా..  కేవలం మంత్రి మల్లారెడ్డి అంశంలోనే వాళ్లంతా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి మల్లారెడ్డి జోగులాంబ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిపై ఆయన స్పందించాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో మల్లారెడ్డి అంశంపై పంచాయితీని మంత్రి కేటీఆర్‌ దగ్గరకు తీసుకెళ్లాలని ఆ నలుగురు భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు