మనీతోనే 'మేనేజ్‌మెంట్‌'

29 Oct, 2020 02:09 IST|Sakshi

ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ కోటా భర్తీలో కాలేజీ యాజమాన్యాల వసూళ్ల పర్వం 

ఆర్టిఫిషల్ ‌ ఇంటెలిజెన్స్‌ సహా సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ కోర్సులకు భారీగా డిమాండ్‌ 

కాలేజీ, బ్రాంచీని బట్టి రూ.14 లక్షల వరకు డిమాండ్‌ 

అటకెక్కిన మెరిట్‌ ఆధారిత సీట్ల భర్తీ ప్రక్రియ 

దందాకు చెక్‌ పెట్టడంలో అధికారులు విఫలం 

ఎంసెట్‌లో 10 వేలకుపైగా ర్యాంకు వచ్చిన విద్యార్థి సీఎస్‌ఈ ఆర్టిఫిషల్ ‌ఇంటెలిజెన్స్‌ కోర్సును రెండో శ్రేణి టాప్‌ కాలేజీలో చదవాలనుకున్నాడు. తండ్రితో కలిసి సదరు కాలేజీ ప్రిన్సిపాల్‌ను కలిశాడు. ఫీజు రూ.12 లక్షలు చెప్పారు. యాజమాన్యాన్ని కలుద్దామంటే అందుబాటులోకి రాలేదు. చివరకు చెప్పిన డొనేషన్‌ చెల్లించి ఆ కాలేజీలో మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరాడు. వాస్తవానికి ఆ కాలేజీ వార్షిక ఫీజు రూ.1.20 లక్షలే ఉంది. అయినా రూ.12 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి వార్షిక ఫీజు అదనం. మరో విద్యార్థినికి 25 వేలకుపైగా ర్యాంకు వచ్చింది. తన స్నేహితులు చేరిన కాలేజీలోనే తానూ చేరతానని పట్టుబట్టింది. ఆమె తండ్రి సదరు కాలేజీని సంప్రదించారు. అక్కడ వార్షిక ఫీజు రూ.90 వేలలోపే ఉండగా, యాజమాన్యం మాత్రం ఏటా రూ.2.50 లక్షలు చెల్లించాలని తెగేసి చెప్పింది. అంటే ఆ కాలేజీలో చేరాలంటే డొనేషన్‌ కింద రూ.6 లక్షలకుపైగా చెల్లించాలి. వార్షిక ఫీజు అదనం. వాస్తవానికి నాలుగేళ్లకు రూ.3.6 లక్షలతో పూర్తి కావాల్సిన కోర్సుకు రూ.10 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. 
–సాక్షి, హైదరాబాద్‌

ఈ ఇద్దరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులే కాదు.. యాజమాన్య కోటాలో సీటు కోసం ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులదీ ఇదే పరిస్థితి. తల్లిదండ్రుల ఆశలను, విద్యార్థుల ఆకాంక్షలను అడ్డుపెట్టుకొని ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు మేనేజ్‌మెంట్‌ కోటా భర్తీలో దందాకు తెరతీశాయి. డొనేషన్ల పేరుతో అడ్డగోలుగా దండుకుంటున్నాయి. సీట్ల భర్తీలో పెద్ద కాలేజీలు ఒకలా, చిన్న కాలేజీలు మరోలా ఫ2‘జులుం’ సాగిస్తున్నాయి. టాప్‌ కాలేజీలు ఒక్కో సీటుకు లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. కొద్ది పేరున్న కాలేజీలో సీటు కావాలంటే రూ.6 లక్షలు మొదలుకొని రూ.14 లక్షల వరకు వెచి్చంచాల్సి వస్తోంది. ప్రముఖ కాలేజీలైతే గతేడాది కంటే ఈసారి మరింత అడ్డగోలుగా రేట్లను పెంచేశాయి. మంచి ర్యాంకు రాని విద్యార్థుల తల్లిదండ్రులు.. పిల్లలను మంచి కాలేజీల్లో చదివించాలన్న ఆలోచనతో అప్పుచేసి మరీ అడిగిన మొత్తం చెల్లిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలోని ఆయా కాలేజీలకు చెందిన కార్యాలయాల్లో డబ్బులు చెల్లిస్తేనే సీట్లను కన్‌ఫర్మ్‌ చేస్తున్నారు. ఆలస్యం చేస్తే ఫీజు మరింత పెరగొచ్చంటూ తల్లిదండ్రులను ఆందోళనలో పడేస్తున్నారు. 

కాలేజీని బట్టి వసూళ్లు 
రాష్ట్రంలోని 176 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 97,741 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపునిచ్చాయి. అందులో 70 శాతం కనీ్వనర్‌ కోటాలో 69,116 సీట్ల (యూనివర్సిటీ కాలేజీల్లోని 3,150 సీట్లు కలిపి) భర్తీకి చర్యలు చేపట్టగా, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్‌ కోటా కింద 30 శాతం సీట్ల (28,625) భర్తీకి యాజమాన్యాలు చర్యలు చేపట్టాయి. అయితే మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లలో చేరే విద్యార్థులు పేరున్న కాలేజీలనే ఎంచుకుంటారు కాబట్టి వాటికే డిమాండ్‌ ఉండటంతో ఇష్టారాజ్యంగా యాజమాన్యాలు డొనేషన్లను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మోస్తరు కాలేజీలోనూ కంప్యూటర్‌ సైన్స్‌ సీటుకు రూ.10 లక్షల డొనేషన్‌ డిమాండ్‌ చేస్తుండగా, టాప్‌ కాలేజీల్లో రూ.14 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కొత్తగా వచి్చన ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్, మిషన్‌ లర్నింగ్, డాటా సైన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సులకు భారీగా రేట్లను పెంచి సీట్లను అమ్ముకుంటున్నారు. ఐటీ, ఈసీఈ వంటి బ్రాంచీల్లోని సీట్లను కూడా కాలేజీని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు, ఈఈఈ, సివిల్‌తో పాటు ఇతర బ్రాంచీల్లో రూ.2 లక్షలు మొదలుకొని రూ.6 లక్షల వరకు వసూలు చేస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

ఉన్నత విద్యామండలి చోద్యం 
యాజమాన్య కోటా సీట్ల భర్తీలో భాగంగా మెరిట్‌ విద్యార్థులకు సీట్లు వచ్చేలా చూసేందుకు కాలేజీకి వచ్చిన దరఖాస్తులను వెబ్‌సైట్‌లో పెట్టడటంతోపాటు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ ద్వారా ఉన్నత విద్యామండలి దరఖాస్తులను స్వీకరించాలి. వాటిని ఆయా కాలేజీలకు పంపించి మెరిట్‌ కలిగిన వారికి సీట్లు వచ్చేలా చూడాలి. కానీ ఉన్నత విద్యామండలి పట్టించుకున్న దాఖలాల్లేవు. కనీసం సాంకేతిక విద్యాశాఖ కూడా దీనిపై దృష్టిసారించట్లేదు. దీంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లను అమ్ముకుంటున్నాయి.  

మెరిట్‌కు స్థానమేదీ?
వాస్తవానికి మేనేజ్‌మెంట్‌ కోటాలోని 30 శాతం సీట్లలో 15 శాతం సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగా భర్తీచేయాలి. మిగిలిన 15 శాతాన్ని ఎన్‌ఆర్‌ఐలకు, వారు స్పాన్సర్‌ చేసిన వారికివ్వాలి. మొద టి 15 శాతం సీట్లను మాత్రం మెరిట్‌ ఆధారంగానే ఇవ్వాలి. ఒకవేళ దరఖాస్తు చేసిన వారిలో జేఈఈ మెయిన్‌ ర్యాంకర్లు లేకుంటే ఎంసెట్‌ ర్యాంకర్లకు, వారూ లేకుంటే ఇంటర్‌ మార్కుల ఆధారంగా ఇవ్వాలి. వచ్చిన దరఖాస్తులను కాలేజీ వెబ్‌సైట్లో పెట్టాలి. కానీ అది అమలు కావట్లేదు. ఏటా ఇదే పరిస్థితి ఉంటున్నా సాంకేతిక విద్యాశాఖ, ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పట్టించుకోవట్లేదు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా