ఇదేంది సారు.. ఒకే రాష్ట్రం.. వేర్వేరు కరెంట్‌ చార్జీలు

8 Feb, 2023 08:14 IST|Sakshi

డిస్కంలకు విద్యుత్‌ నియంత్రణ మండలి ఆదేశం 

తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: నిబంధనల ప్రకారం 30 రోజుల ముందస్తు నోటీసులు జారీ చేసిన తర్వాతే విద్యుత్‌ వినియోగదారుల నుంచి ముందస్తు వినియోగ ధరావతు (ఏసీడీ) వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆదేశించింది. అప్పటి వరకు ఏసీడీ చార్జీల వసూళ్లను నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. వినియోగదారులకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఏసీడీ చార్జీల లెక్కలను నోటీసుల్లో పొందుపర్చాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు తాజాగా ఈఆర్సీ మార్గదర్శకాలను జారీ చేసింది. 

ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) భారీ మొత్తంలో ఏసీడీ చార్జీలు వసూలు చేస్తోందని వ్యతిరేకత రావడంతో ఈఆర్సీ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. వినియోగదారుడి వార్షిక విద్యుత్‌ వినియోగం ఎంత? అందులో రెండు నెలల సగటు వినియోగం ఎంత? ఈ మేరకు వినియోగానికి చెల్లించాల్సిన డిపాజిట్‌ ఎంత? ఇప్పటికే డిస్కం వద్ద ఉన్న ఆ వినియోగదారుడి డిపాజిట్‌ మొత్తాన్ని సర్దుబాటు చేశాక చెల్లించాల్సిన అదనపు వినియోగ డిపాజిట్‌ ఎంత? .. వంటి లెక్కలను నోటీసుల్లో పొందుపర్చాలని కోరింది. ఇప్పటి వరకు నోటీసులు లేకుండానే ఏసీడీ చార్జీలు వసూలు చేసిన నేపథ్యంలో ఆ వినియోగదారులకు సైతం నోటీసులు జారీ చేయాలని కోరింది. విద్యుత్‌ నియంత్రణ మండలి జారీ చేసిన రెగ్యులేషన్‌ 6, 2004 ప్రకారం ఉత్తర తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిలాల్లో గత రెండు నెలలుగా ఏసీడీ చార్జీలను టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ విధిస్తోంది. 

నిబంధనలకు వ్యతిరేకమని విమర్శలు.. 
ఏపీఈఆర్సీ జారీ చేసిన రెగ్యులేషన్‌ 6, 2004 ప్రకారం డిస్కంలు వినియోగదారుల నుంచి అదనపు సెక్యూరిటీ డిపాజిట్‌ (ఏఎస్డీ) వసూలు చేసుకోవచ్చు. గృహ వినియోగదారులకు కొత్తగా కనెక్షన్‌ ఇచ్చేటప్పుడు ఏఎస్డీ కింద కిలోవాట్‌కు రూ.80 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తారు. కనెక్షన్‌ ఇచ్చిన తర్వాత ఏడాదిపాటు వినియోగదారుడి సగటు విద్యుత్తు వినియోగాన్ని లెక్కగట్టి రెండు నెలల సగటు మొత్తాన్ని ఏఎస్డీ చార్జీల రూపంలో మరోసారి వసూలు చేసుకోవచ్చు. ఆపై ప్రతీ ఏటా ఆ ఏడాది సగటు వినియోగాన్ని, అంతకు ముందు ఏడాది సగటుతో పోల్చి చూసి, అదనంగా జరిగిన సగటు వినియోగానికి మాత్రమే ఏఎస్డీ చార్జీలు వసూలు చేస్తారు.

ఈ చార్జీలు డిపాజిట్‌ రూపంలో వినియోగదారుల పేరుమీదనే విద్యుత్‌ సంస్థల వద్ద ఉంటాయి. ఈ రెగ్యులేషన్‌ జారీ చేసిన 19 ఏళ్ల తర్వాత ఏఎస్డీకి బదులు ఏసీడీ చార్జీల పేరుతో టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ వసూళ్లను ప్రారంభించింది. విద్యుత్‌ చట్టం, ఈఆర్సీ రెగ్యులేషన్లలో ఎక్కడా ఏసీడీ చార్జీల ప్రస్తావన లేనందున, వీటిని వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని విద్యుత్‌ రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.  

ఒకే రాష్ట్రం.. వేర్వేరు చార్జీలు     
ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలకు రెండు వేర్వేరు డిస్కంలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నా ఏకరూప చార్జీలు అమల్లో ఉన్నాయి. కొత్తగా ఉత్తర తెలంగాణ జిల్లాల గృహ వినియోగదారులపై ఏసీడీ చార్జీలను విధిస్తుండటంతో ఒకే రాష్ట్రంలో వేర్వేరు విధానాలను అమలుచేస్తున్న విచిత్ర పరిస్థితి. ఇప్పటివరకు ఏఎస్డీ చార్జీలను కమర్షియల్, పరిశ్రమల వర్గాల నుంచి మాత్రమే వసూలు చేసేవారు. 

మరిన్ని వార్తలు