Color Mystery: కనిపించేదంతా  ‘బ్లూ’ కాదు!

5 Jun, 2021 08:55 IST|Sakshi

సాక్షి సెంట్రల్‌ డెస్క్‌: ఈ సీతాకోక చిలుక ఏ రంగులో ఉంది. అదేమిటి నీలి రంగులోనే కదా అంటారా? అక్కడే తప్పులో కాలేశారన్న మాట. అది మనకు నీలి రంగులో కనిపించడం అంతా మన దృష్టి భ్రమ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇదే కాదు జంతుజాలంలో 99 శాతం జీవుల్లో వేటిలోనూ నీలి రంగు అనేదే లేదని అంటున్నారు. మరి మన కళ్లముందు కనిపిస్తున్నా అది నీలి రంగు కాదనడం ఏంటి? అసలు ఏమిటీ రంగు మిస్టరీ అని సందేహాలు వస్తున్నాయా.. ఇదేంటో తెలుసుకుందామా? 

అప్పుడు కళ్లు లేవు.. కలర్‌ సమస్య లేదు! 
భూమ్మీద జీవం ఆవిర్భవించి వందల కోట్ల ఏళ్లు అవుతోంది. సుమారు 60 కోట్ల ఏళ్ల కిందటి వరకు ప్రాథమిక దశలోనే ఉన్న జీవులు వేటికీ కళ్లు లేవు. అప్పుడు జంతుజాలానికి రంగుల సమస్యే లేదు. ఆ తర్వాత జంతుజాలం అభివృద్ధి చెంది కళ్లు ఏర్పడ్డాయి. అందంగా కనబడేందుకు, తోడును ఆకట్టుకునేందుకు, కొన్నిసార్లు శత్రు జీవులను భయపెట్టేందుకు, లేదా వాటికి దొరక్కుండా తప్పించుకునేందుకు.. ఇలా వాటి అవసరానికి తగినట్టుగా రంగులు, డిజైన్లను సంతరించుకోవడం మొదలైంది. 

జంతుజాలంలో ఒక శాతమే.. 
సీతాకోక చిలుకలు సహా పలు రకాల జంతువులు మనకు నీలి రంగులో కనిపిస్తుంటాయి. కానీ చాలా వరకు నిజమైన నీలిరంగు కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం జంతుజాలంలో ఒక శాతం కంటే తక్కువ మాత్రమే నీలి రంగులో ఉంటాయి. మరి ఎందుకిలా..? 

‘నీలి రంగు’ సమస్యేంటి? 
ప్రతి రంగుకు సంబంధించి కొన్నిరకాల రసాయనాలు ఉంటాయి. వాటినే కలర్‌ పిగ్మెంట్స్‌ అంటారు. వీటిపై కాంతి పడినప్పుడు సంబంధింత రంగులను ప్రతిఫలిస్తాయి. దాంతో ఆ రంగు మన కంటికి కనిపిస్తుంది. జంతువుల్లోగానీ, మొక్కల్లోగానీ ఏవైనా భాగాల్లో ఏ రంగు పిగ్మెంట్స్‌ ఉంటే.. ఆ రంగు కనిపిస్తుంది.  

  • అన్ని జంతువులకు కూడా కలర్‌ పిగ్మెంట్స్‌ అవి తినే ఆహారం ద్వారానే అందుతాయి. జంతువులు ఏవైనా ప్రాథమిక ఆహారం మొక్కల నుంచే వస్తుంది. (మాంసాహార జీవులైనా కూడా అవి తినే జంతువుల ఆహారం మొక్కలే). ఇక్కడే అసలు తిరకాసు ఉంది. మొక్కల్లో నీలి రంగు పిగ్మెంట్స్‌ అత్యంత అరుదు. దాంతో జంతుజాలానికి ఆహారం నుంచి నీలి రంగు అందే అవకాశాల్లేవు. 

రంగే లేనప్పుడు.. ఎలా కనిపిస్తుంది? 
నీలం రంగు పిగ్మెంట్స్‌ అరుదు కావడంతో జంతుజాలం.. వాటిని సేకరించుకోవడం మానేసి, దృష్టి భ్రమపై ఆధారపడ్డాయి. కొన్ని రంగులు, రంగుల మిశ్రమాలను కొన్ని కోణాల్లో చూసినప్పుడు వేరే రంగులుగా భ్రమ కలుగుతుంది. ఈ తరహాలోనే నీలి రంగు కనిపించేలా కొన్ని జంతువులు ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. 

సీతాకోకచిలుక చేసే ట్రిక్‌ ఏంటి? 
నీలి రంగు రెక్కలు, అంచుల్లో నలుపు రంగుతో ‘బ్లూ మార్ఫో’ రకం సీతాకోకచిలుక చాలా అందంగా కనిపిస్తుంది. నిజానికి ఇది నీలి రంగులో ఉండదు. దీని రెక్కల్లో అత్యంత సన్నగా ఎగుడు, దిగుడు నిర్మాణాలు ఉంటాయి. ఈ రెక్కలపై పడిన కాంతి అక్కడికక్కడే ప్రతిఫలించి.. ఒక్క నీలి రంగు కాంతి మాత్రమే బయటికి కనబడేలా ఏర్పాటు ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే.. వేర్వేరు కోణాల్లో చూసినప్పుడు ఈ సీతాకోకచిలుక రెక్కలు రంగులు మారుతుంటాయి.

  • మనం బాగా ఇష్టపడే నెమలి ఈకలు కూడా ఇలా మామూలుగా చూస్తే నీలి రంగులో మెరుస్తుంటాయి. కాస్త అటూ ఇటూ తిప్పితే వేర్వేరు రంగులు కనిపించడం మనకు తెలిసిందే. 

మరి అసలైన నీలి రంగు ఏది? 
ఏ వైపు నుంచి చూసినా కచ్చితంగా ఒకే స్థాయిలో నీలం రంగు కనిపిస్తే.. అది అసలైన నీలి రంగు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలైన రంగు పిగ్మెంట్స్‌ ఉన్నప్పుడు.. ఒకేస్థాయిలో రంగు కనిపిస్తుందని.. లేతగా, ముదురుగా మారడం కూడా ఉండదని వివరిస్తున్నారు. ఈ ‘ది ఓబ్రినా ఆలివ్‌వింగ్‌’ రకం సీతాకోక చిలుకలపై ఉండే నీలి రంగు పక్కా ఒరిజినల్‌ అని తేల్చారు.
చదవండి: Harish Rao Birthday: వినూత్న బహుమతి

మరిన్ని వార్తలు