ఏం రోగమో ఏమో!

14 Aug, 2020 09:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తమకు కరోనా వచ్చిందేమోనని అనుమానాలు 

వైరస్‌ లక్షణాలు లేకున్నా విరివిగా వైద్య పరీక్షలు 

ప్రైవేట్‌ ల్యాబ్‌లు, ప్రభుత్వాస్పత్రుల వద్ద బారులు 

మందులు, వైద్య చికిత్స విధానాలపై ఆరా 

గ్రేటర్‌ పరిధిలో పెరుగుతున్న బాధితుల సంఖ్య 

ప్రతి 100 మందిలో 10 మందికిపైగా ఈ తరహా 

‘ఫ్యాట్‌ఫైల్‌ సిండ్రోమ్‌’ వల్లేనంటున్న సైకియాట్రిస్ట్‌లు 

తప్పనిసరైతేనే టెస్టులు చేయించుకోవాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: ‘అనుమానం పాత రోగం’ అనే సామెత ప్రస్తుతకరోనా కాలంలో విస్తృతంగామారిందనడానికి కొందరు జనాల తీరు విస్మయపరుస్తోంది. ఫ్యాట్‌ఫైల్‌ సిండ్రోమ్‌ అనే మానసిక వ్యాధిలక్షణాన్ని తలపిస్తోంది. ఎలాంటి రుగ్మత, అనారోగ్య లక్షణాలులేకుండానే తమకు ఏదో జబ్బు ఉన్నట్లు ఊహించుకొని రకరకాల వైద్య పరీక్షలు చేయించుకుంటారు. హెల్త్‌ ఫైళ్లను పట్టుకొని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతారు. సాధారణంగా వంద మందిలో ఒక్కరు లేదా ఇద్దరు ఇలాంటి సమస్యలతో బాధపడతారు. కానీ.. ప్రస్తుతం కోవిడ్‌ మహమ్మారి కారణంగా గ్రేటర్‌ పరిధిలో ‘ఫ్యాట్‌ఫైల్‌ సిండ్రోమ్‌’తో బాధపడుతున్నవారి సంఖ్య బాగా పెరుగుతున్నట్లు మానసిక వైద్య నిపుణుల అధ్యయనంలో వెల్లడయ్యింది. సంపూర్ణ ఆర్యోవంతులు కూడా తమకు కరోనా వైరస్‌ సోకిందేమోననే ఆందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రులు, లేబొరేటరీల చుట్టూ తిరుగుతున్నారు. (రానున్న రోజుల్లో వారి సంఖ్య రెట్టింపు: నాగార్జున )

ఒకటికి రెండుసార్లు కోవిడ్‌ టెస్టులు చేసుకుంటున్నారు. పరీక్షల్లో  ‘నెగెటివ్‌’ అని తేలినప్పటికీ రెండోసారి, మూడోసారి టెస్టులకు కూడా వెళ్తున్నట్లు హైదరాబాద్‌ సైకియాట్రిస్ట్స్‌ అసోసియేషన్‌  ప్రతినిధి డాక్టర్‌ సతీష్‌ సంగిశెట్టి విస్మయం వ్యక్తం చేశారు. ప్రతి 100 మందిలో ఇప్పుడు 10 మందికిపైగా ఈ తరహా టెస్టులు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఒకవైపు కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ ఎలాంటి  పరీక్షలకు వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తున్నవారు కొందరైతే.. ఏ లక్షణాలూ లేకపోయినా పదే పదే టెస్టులతో ఆందోళన పెంచుకుంటున్నవారు మరికొందరు. ఇలాంటి ఫ్యాట్‌ఫైల్‌ సిండ్రోమ్‌ లక్షణాలు ఉన్నవాళ్లు ఒక్క కోవిడ్‌ పరీక్షలే కాకుండా ఇతర జబ్బుల పట్ల కూడా అనుమానంతో పరీక్షలు చేసుకోవడం గమనార్హం. అంతటితో ఆగకుండా కరోనా కోసం వినియోగించే మందులు, వైద్య చికిత్సల కోసం ఆన్‌లైన్‌లోనూ, సామాజిక మాధ్యమాల్లో  విస్తృతంగా అన్వేషిస్తున్నారు.  

పాప తుమ్మిందనీ.. 
బోయిన్‌పల్లికి చెందిన శ్రీనివాస్‌ (పేరు మార్చాం.)ది పెద్ద కుటుంబం. ఆ ఇంట్లో 8 మంది  ఉంటారు. అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఎలాంటి సమస్యలూ లేవు. పైగా కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ.. కొద్ది రోజుల క్రితం శ్రీనివాస్‌ ఎనిమిదేళ్ల కూతురు రెండు మూడుసార్లు తుమ్మడంతో ఇంట్లో ఆందోళన మొదలైంది. అందరూ కలిసి  సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌కు పరుగులు తీశారు. కోవిడ్‌ టెస్టుల్లో అందరికి ‘నెగెటివ్‌’ అని తేలిపోయింది. కానీ.. రూ.30 వేల వరకు సమర్పించుకోవాల్సివచ్చింది. పైగా టెస్టుల సమయంలో పీపీఈ కిట్‌లు, ఎన్‌– 95 మాస్కులు వంటి వాటి కోసం అదనంగా చెల్లించుకోక తప్పలేదు. వీటన్నింటి కంటే రెండు రోజుల పాటు ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురయ్యింది. పాపకు, ఇంట్లో ఉన్న తమకు కరోనా వచ్చిందేమోననే బాధతో నిద్ర లేకుండా గడిపారు. ఒక్క  శ్రీనివాస్‌ కుటుంబంలోనే కాదు. నగరంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కాలనీల్లో, అపార్ట్‌మెంట్లలో ఒక్కరిద్దరు కరోనా బారిన పడితే మిగతావాళ్లు తమకు లక్షణాలు లేకపోయినా టెస్టుల కోసం వెళ్తున్నారు. దీంతో  అవసరమైన వాళ్లకు సకాలంలో టెస్టులు చేయలేని పరిస్థితి  తలెత్తుతోందని ప్రముఖ లేబొరేటరీకి చెందిన టెక్నీషియన్‌ ఒకరు అభిప్రాయపడ్డారు.  (కరోనా: తెలంగాణ హెల్త్‌ బులెటిన్‌ )

ఎందుకీ పడిగాపులు.. 
నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, ఏరియా ఆస్పత్రుల వద్ద నిర్వహించే ర్యాపిడ్‌ పరీక్షల్లో, ప్రైవేట్‌ ల్యాబ్‌లకు టెస్టుల కోసం అనుమానంతో వచ్చేవారి సంఖ్యే ఎక్కువగా  ఉంటోంది. ఇటీవల ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 250 మందికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి మాత్రమే పాజిటివ్‌ అని తేలింది. సాధారణ ఫ్లూ లక్షణాలతో టెస్టులకు వచ్చిన వాళ్లను మినహాయిస్తే 170 మంది వరకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా కేవలం అనుమానంతో వచ్చినట్లు ఒక అధికారి చెప్పారు. మరోవైపు అనవసరమైన టెస్టుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తూ ఎదురుచూడాల్సి వస్తోంది. ఇలాంటి అనుమానితుల  భయాందోళనలను ప్రైవేట్‌ ఆస్పత్రులు, లేబొరేటరీలు సొమ్ము చేసుకుంటున్నాయి. మరోవైపు నిత్యావసర వస్తువుల తరహాలో ఇళ్లల్లో కోవిడ్‌ మందుల నిల్వలను పెంచుకుంటున్నారు.  

స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష.. 
ఈ తరహా ఫ్యాట్‌ఫైల్‌ సిండ్రోమ్‌తో బాధపడుతూ టెస్టుల పేరిట అనవసరమైన ఆందోళన, డిప్రెషన్‌కు గురికావడం కంటే ఎవరికివారు స్వీయజాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా ఉండడమే చక్కటి పరిష్కారమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగని లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే టెస్టు చేసుకోవాలని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ çసంహిత సూచించారు. 

అనుమానం సహేతుకంగా ఉండాలి..  
అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడు అనుమానించి అవసరమైన పరీక్షలు చేసుకోవడం, వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. కానీ ఏ లక్షణాలు లేకపోయినా పదే పదే ఏదో ఒక జబ్బును ఊహించుకొని ఆందోళనకు గురికావడం, సొంతంగా పరీక్షలకు వెళ్లడం సరైంది కాదు. అనవసరమైన భయాందోళనతో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంతంగా, సంతోషంగా ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితినైనా జయించవచ్చు. 
– డాక్టర్‌ సతీష్‌ సంగిశెట్టి, సీనియర్‌ సైకియాట్రిస్ట్‌

మరిన్ని వార్తలు