మెట్రో బాట..నోట్లవేట!

30 Jan, 2021 08:12 IST|Sakshi

 మెట్రోరైలు స్టేషన్ల సమీపాల్లోవాణిజ్య స్థలాల అభివృద్ధి 

కావూరిహిల్స్, జూబ్లీ చెక్‌పోస్ట్, మాదాపూర్‌ ప్రాంతాల్లో నిర్మాణాలు 

నష్టాల నుంచి గట్టెక్కేందుకే.. 

గ్రేటర్‌ మెట్రో వాణిజ్య బాట పట్టనుంది. మెట్రో స్టేషన్లకు సమీపంలో ప్రభుత్వం కేటాయించిన విలువైన స్థలాలను వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు వీలుగా కమర్షియల్‌ షెడ్లుగా అభివృద్ధి చేసి అద్దెకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా కావూరిహిల్స్‌ సమీపంలోని లుంబినీ ఎన్‌క్లేవ్‌ వద్ద 2990  చదరపు గజాలు, మాదాపూర్‌ నీరూస్‌ ఎదురుగా ఉన్న 2 వేల చదరపు గజాలు, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలోని 1210 చదరపు గజాల స్థలాల్లో వాణిజ్య షెడ్లను అభివృద్ధి చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు మెట్రో ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. గతంలో మాల్స్‌ అభివృద్ధి చేయాలనుకున్న ప్రాంతాల్లో ‘కమర్షియల్‌ స్పేస్‌’ రూపకల్పనకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిసింది. 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ దెబ్బతో ఆర్థికంగా ఎదురవుతున్న నష్టాలను ఎదుర్కొనేందుకు మెట్రో సంస్థ పలు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే నాంపల్లి చౌరస్తా వద్ద పీపీపీ విధానంలో ఓ ప్రైవేటుసంస్థ సౌజన్యంతో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ కేంద్రాన్ని నెలకొల్పుతోన్న హెచ్‌ఎంఆర్‌ సంస్థ..పాతనగరంలోని కిల్వత్‌ ప్రాంతంలోనూ మరో పార్కింగ్‌ కేంద్రాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు తాజాగా వాణిజ్య షెడ్ల అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ అనంతరం సైతం భారీ   నష్టాలను చవిచూస్తోన్న సంస్థ ..గట్టెక్కేందుకు ఆపసోపాలు పడుతుండడం గమనార్హం. 

మాల్స్‌ నుంచి వాణిజ్య స్థలాలుగా.... 

  • మెట్రో నిర్మాణ ఒప్పందం సమయంలో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి కేటాయించిన విలువైన స్థలాల్లో రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులు, మాల్స్‌ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్న విషయం విదితమే.    
  • నాగోల్‌–రాయదుర్గం, జేబీఎస్‌–ఎంజీబీఎస్, ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లలో 69 కి.మీ మార్గంలో గతంలో 18 మాల్స్‌ నిర్మించాలని నిర్మాణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. 
  • రాష్ట్ర విభజన, ఆర్థిక నష్టాల భయం నేపథ్యంలో మాల్స్‌ సంఖ్యను 4కు కుదించింది. ప్రస్తుతం మూసారాంబాగ్, ఎర్రమంజిల్, పంజగుట్ట, హైటెక్‌సిటీ వద్ద మాల్స్‌ను నిర్మించింది.  
  • మిగతా చోట్ల మాల్స్‌ నిర్మాణాన్ని వాయిదా వేసింది. 
  • ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వాణిజ్య షెడ్లను పీపీపీ విధానంలో ఏర్పాటుచేసి అద్దెకు ఇవ్వడం ద్వారా కొంత మేర ఆదాయాన్ని ఆర్జించాలని హెచ్‌ఎంఆర్‌ నిర్ణయించడం విశేషం. 

నష్టాల నుంచి గట్టెక్కేనా? 

  • గ్రేటర్‌ వాసుల కలల మెట్రోకు కోవిడ్‌ కలకలం, లాక్‌డౌన్‌ ఆర్థికంగా నష్టాల బాట పట్టించింది. 
  • గతేడాది మార్చికి ముందు మూడు మార్గాల్లో నిత్యం 4 లక్షలమంది ప్రయాణికులతో కళకళలాడిన మెట్రో రైళ్లు.. ప్రస్తుతం 1.70 లక్షల నుంచి 2 లక్షలమంది ప్రయాణికులతో కనాకష్టంగా నెట్టుకొస్తున్నాయి. 
  • ప్రయాణికుల ఛార్జీలు, వాణిజ్య ప్రకటనలు, రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా ఆదాయ ఆర్జన చేయాలనుకున్న సంస్థ ఆశలు తల్లకిందులయ్యాయి.  
  • ప్రస్తుతం వస్తున్న ఆదాయం సరిపోకపోగా..నిత్యం మె ట్రో డిపోలు, స్టేషన్లు, రైళ్ల నిర్వహణకు అదనంగా నిర్మా ణ సంస్థ నిత్యం కోటి వ్యయం చేస్తున్నట్లు సమాచారం. 
  • మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీతోపాటు నిర్మాణ సంస్థ, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ స్టేషన్ల పరిసరాలను, పార్కింగ్‌ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోన్న  హైదరాబాద్‌ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్‌)సంస్థ కూడా నష్టాల బాటపట్టింది.  
  • ప్రభుత్వం ఏటా వార్షిక బడ్జెట్‌లో కేటాయించే మొత్తం హెచ్‌ఎంఆర్‌ ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలకు కూడా కనాకష్టంగా సరిపోతోంది.  
  • దీంతో నష్టాల నుంచి గట్టెక్కేందుకు వాణిజ్య షెడ్ల నిర్మాణం ప్రతిపాదనలను హెచ్‌ఎంఆర్‌ ముందుకు తీసుకొచ్చినట్లు తెలిసింది.  
మరిన్ని వార్తలు