వర్క్‌ ఫ్రం హోం వద్దు!.. సగం రోజులు ఆఫీస్, సగం రోజులు ఇంటి నుంచి, లేదా వీలునుబట్టి..

13 Jul, 2022 08:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై పూర్తిగా ఇంటి నుంచి పనిచేసే ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానానికి కాలం చెల్లినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోవిడ్‌ మహమ్మారి వల్ల దాదాపు రెండున్నరేళ్ల పాటు బాగా అలవాటైన ఈ పద్ధతిని క్రమంగా మార్చుకోవాల్సిందేనని అంటున్నారు. ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ఇతర ఉద్యోగులు ‘వర్క్‌ ఫ్రం హోం’ విధానానికి తగ్గట్టుగా తమను మలుచుకున్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొన్ని కేసులొస్తున్నా స్వల్ప లక్షణాలే ఉంటుండడంతో పరిస్థితులు దాదాపు సాధారణమయ్యాయి.

ఈ పరిస్థితుల్లో సగం రోజులు ఆఫీస్, సగం రోజులు ఇంటి నుంచి, లేదా వీలునుబట్టి పనిచేసే ‘హైబ్రిడ్‌ వర్కింగ్‌ మోడల్‌’కే కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా సీబీఆర్‌ఈ దక్షిణాసియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్‌లోని 73 శాతం కంటే ఎక్కువ ‘ఆఫీస్‌ స్పేస్‌ ఆక్యుపయర్స్‌’ పూర్తిగా వర్క్‌ ఫ్రం హోం కాకుండా ఈ హైబ్రిడ్‌ వర్కింగ్‌ విధానాన్ని కోరుకుంటున్నట్టు స్పష్టమైంది.

సీబీఆర్‌ఈ ‘2022 ఇండియా ఆఫీస్‌ స్పేస్‌ ఆక్యుపయర్స్‌ సర్వే’లో... అవసరమైన సందర్భాల్లో పూర్తిగా రిమోట్‌ వర్కింగ్, మూడు రోజులు ఆఫీస్‌ – మూడు రోజులు ఇంటి నుంచి పని, ఆఫీస్‌ లేదా ఇల్లు అవసరానికి తగ్గట్టు మార్చుకునే అవకాశం, మూడు రోజులకు పైగా వర్క్‌ ఫ్రం హోం, రెండు రోజులు ఆఫీస్‌ ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఇందులో 35 శాతం మంది మూడు రోజులకు మించి ఆఫీసు నుంచి పని చేయాలని కోరుకుంటే, 38 శాతం మంది ఆఫీస్, రిమోట్‌ వర్క్‌ డేస్‌ సమానంగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగుల ఆరోగ్యం, యోగ క్షేమాలు ప్రధానం కాబట్టి వారు ఆఫీసులకు సులభంగా వచ్చేందుకు ఈ హైబ్రిడ్‌ విధానం ఉపయోగపడుతుందని కంపెనీలు సైతం దీనివైపే మొగ్గు చూపుతున్నాయి.

చదవండి: ఐఐసీటీ శాస్త్రవేత్తలకు అరుదైన గుర్తింపు

మరిన్ని వార్తలు