ఔటర్‌ లీజుపై డౌట్‌!. ఆశించిన ఆదాయం ఉండదంటున్న నిర్వహణ సంస్థలు 

17 Jan, 2023 09:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌రింగ్‌ రోడ్డును లీజుకు ఇవ్వడం ద్వారా రూ.వేల కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్న ప్రభుత్వానికి నిర్మాణ సంస్థల నుంచి నిరాసక్తత వ్యక్తమవుతోంది.158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ మార్గాన్ని  30 ఏళ్లు పాటు లీజుకు ఇచ్చేందుకు హెచ్‌ఎండీఏ కార్యాచరణ చేపట్టిన విషయం విదితమే. టోల్‌–ఆపరేట్‌– ట్రాన్స్‌ఫర్‌ (టీఓటీ)పద్ధతిలో లీజుకు ఇచ్చేందుకు టెండర్లను ఆహ్వానించింది.

సుమారు రూ.8 వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా లీజు ప్రక్రియలో భాగంగా గత నెలలో హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ప్రీబిడ్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సుమారు 12  దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయి. వివిధ అంశాలపై కొన్ని సంస్థలు తమ సందేహాలను వ్యక్తం చేశాయి. సమీప భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న  రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)తో ఔటర్‌పై వాహనాల రాకపోకలు తగ్గుముఖం పట్టవచ్చని పలు సంస్థలు సందేహం వ్యక్తం చేశాయి. దీనివల్ల  తమ పెట్టుబడులకు తగిన ఆదాయం లభించకపోవచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం సుమారు 80 శాతం వాణిజ్య వాహనాలు ఔటర్‌ మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి.  

పెరిగిన వాహనాల రాకపోకలు... 
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే లారీలు, ట్రక్కులు వంటి వాణిజ్య వాహనాలతో పాటు  వ్యక్తిగత  వాహనాలు కూడా  ఔటర్‌ నుంచి పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. శంషాబాద్, నానక్‌రాంగూడ, నార్సింగి, పటాన్‌చెరు, కండ్లకోయ, శామీర్‌పేట్, కీసర, ఘట్కేసర్, పెద్దఅంబర్‌పేట్‌ల మీదుగా మొత్తం 158 కిలోమీటర్లు ఉన్న ఔటర్‌ మార్గంలో ప్రతి రోజు లక్షకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

ప్రస్తుతం ఈగిల్‌ ఇన్‌ఫ్రా సంస్థ టోల్‌ నిర్వహణ చేపట్టింది. దీనిద్వారా ప్రభుత్వానికి ఏటా కొంత మొత్తంలో ఆదాయం లభిస్తోంది. రహదారులు, విద్యుత్, పచ్చదనం తదితర నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ పర్యవేక్షిస్తోంది. ఔటర్‌ మార్గాన్ని లీజుకు ఇవ్వడం వల్ల  భారీ ఎత్తున ఆదాయం లభిస్తుందని ప్రభుత్వ అంచనా. ఈ మేరకు ప్రణాళికలను రూపొందించి కార్యాచరణ చేపట్టారు.  

ఇదీ రీజినల్‌ రోడ్డు మార్గం.. 
►ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌రోడ్డు ఉత్తరం దిశలో సంగారెడ్డి, కంది, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, యాదాద్రి, చౌటుప్పల్‌ మీదుగా చేపట్టనున్నారు. దక్షిణం దిశలో ఇబ్రహీంపట్నం, కందుకూరు, చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా సంగారెడ్డికి చేరుకుంటుంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డు మొత్తం  340 కి.మీ. ప్రభుత్వం ఇప్పటికే  భూసేకరణ చేపట్టింది. మొదట ఉత్తరం వైపు ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తి చేసి అనంతరం దక్షిణం వైపు చేపట్టనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో నగరంలోనూ, ఔటర్‌పై ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని అంచనా . 

►ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రత్యామ్నాయం..  
►ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం పూర్తయితే  బెంగళూరు జాతీయ రహదారి మీదుగా అంతర్రాష్ట్ర వాహనాలు షాద్‌నగర్‌ వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌ మీదుగా కంది మార్గంలో ముంబైకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ వాహనాలు శంషాబాద్‌ వద్ద ఔటర్‌పైకి  ప్రవేశించి పటాన్‌చెరు నుంచి ముంబై రూట్‌లో వెళ్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ అందుబాటులోకి వస్తే బెంగళూరు– ముంబై మధ్య నడిచే వాహనాలకు చాలా వరకు దూరం తగ్గడమే కాకుండా సమయం కూడా కలిసి వస్తుంది.

►బెంగళూరు జాతీయ రహదారి నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలు చౌటుప్పల్‌ వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌పైకి  ప్రవేశించి షాద్‌నగర్‌ వరకు వెళ్లవచ్చు. ప్రస్తుతం  ఈ వాహనాలు ఔటర్‌పై పెద్దఅంబర్‌పేట్‌–శంషాబాద్‌ మార్గంలో  వెళ్తున్నాయి.  ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌పై 80 శాతం ఆదాయం భారీ కమర్షియల్‌ వాహనాల నుంచే లభిస్తోంది. కంటైనర్లు, లారీలు, ట్రక్కులు వంటివి సుమారు 1.06 లక్షల వాహనాలు  నడుస్తున్నాయి. ఈ  వాహనాలు  భవిష్యత్తులో ఆర్‌ఆర్‌ఆర్‌ వైపు మళ్లే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు