వందేభారత్‌ X గరుడ ప్లస్‌!

1 Oct, 2023 03:39 IST|Sakshi

బెంగళూరు రూట్‌లోరైల్వే, ఆర్టీసీ మధ్య పోటీ 

తక్కువ వ్యవధితో వందేభారత్‌కు బస్సు ప్రయాణికులు మొగ్గు 

వారిని ఆకర్షించేందుకు ఆర్టీసీ చర్యలు

భారీగా గరుడ చార్జీల తగ్గింపు 

రూ. 300 వరకు తగ్గింపు 

దీంతో గరుడ వైపు క్రమంగా మొగ్గు 

సిద్దిపేట, కృష్ణాల నుంచి త్వరలో రైలు సేవలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైల్వే విస్తరణతో ఆర్టీసీకి పోటీ ఎదురైంది. ఇటీవలే ప్రారంభమైన కాచిగూడ–బెంగళూరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆదరణ లభించడం.. ప్రతి ట్రిప్పులో దాదాపు 500 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణిస్తుండటంతో ఇది హైదరాబాద్‌–బెంగళూరు మధ్య పగటిపూట తిరిగే ఆర్టీసీ గరుడ బస్సులపై కొంత ప్రభావం చూపుతోంది.

వందేభారత్‌ సైతం పగలే పరుగులు తీస్తున్నా కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే గమ్యం చేరుతుండటం ప్రజాదరణకు కారణమవుతోంది. దీంతో రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది ఈ రైలు వైపు మళ్లితే గరుడ ప్లస్‌ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో తగ్గే అవకాశం ఉందని గుర్తించిన ఆర్టీసీ యాజమాన్యం అప్రమత్తమైంది. ప్రయాణికులను ఆకర్షించే చర్యలు చేపట్టింది. 

పక్కాగా డైనమిక్‌ ఫేర్‌ సిస్టం... 
కాచిగూడ–బెంగళూరు వందేభారత్‌ ఎనిమిదన్నర గంటల్లో గమ్యం చేరుకుంటుంటే హైదరాబాద్‌–బెంగళూరు గరుడ ప్లస్‌ బస్సు 11 గంటలు తీసుకుంటోంది. దీంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అటు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సులపై ప్రభావం పెద్దగా లేకుండా ఉండేందుకు డైనమిక్‌ ఫేర్‌ విధానాన్ని పక్కాగా నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

వందేభారత్‌ రైలు టికెట్‌ చార్జీ (భోజనం చార్జీ లేకుండా) రూ. 1,255గా ఉండగా ఆర్టీసీ గరుడ ప్లస్‌ బస్సు టికెట్‌ చార్జీ 1,200గా ఉంది. అందువల్ల డైనమిక్‌ ఫేర్‌ విధానాన్ని పక్కాగా అమలు చేయడం ద్వారా వారాంతాల్లో కాకుండా డిమాండ్‌ తక్కువగా ఉండే సాధారణ రోజుల్లో టికెట్‌ ధర రూ. 880గా మారుతోంది. మంగళ, బుధ, గురువారాల్లో తక్కువ ధర, మిగతా రోజుల్లో కాస్త ఎక్కువ ధర ఉంటోంది.

సాధారణ రోజులు, ప్రయాణ సమయం వంటి మొత్తం 44 అంశాలను పరిగణనలోకి తీసుకొని టికెట్‌ ధరలను రకరకాల మొత్తాలకు తగ్గించి ఆర్టీసీ ఖరారు చేస్తోంది. ఇది ఆటోమేటిక్‌గా ఖరారయ్యేలా సాంకేతికను వినియోగిస్తోంది. టికెట్‌ చార్జీ భారీగా తగ్గడంతో బస్సుల వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. 

సిద్దిపేట, ఇతర ప్రాంతాలకు రైలు సర్వీసులతో..
ఇక ప్రస్తుతం సిద్దిపేటకు ఆర్టీసీ నిత్యం 15 నిమిషాలకో బస్సు నడుపుతోంది. ఇవి ఆర్టీసీకి కాసులు కురిపిస్తున్నాయి. కానీ మరో మూడు రోజుల్లో సిద్దిపేట నుంచి కాచిగూడకు రైలు సర్వీసు ప్రారంభం అవుతోంది. ఒక ట్రిప్పులో వెయ్యి మందిని తరలించే అవకాశం ఉండటంతో ఇది కూడా ప్రభావం చూపుతుందని ఆర్టీసీ భావిస్తోంది. ఇక మహబూబ్‌నగర్‌ సమీపంలోని జక్లేర్, మక్తల్, మాగనూరు, కృష్ణా లాంటి ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి ప్రయాణిస్తుంటారు.

అయితే దేవరకద్ర–కృష్ణా మధ్య ఆదివారం నుంచి రైలు సర్విసు ప్రారంభం కానుంది. దీంతో కృష్ణా–కాచిగూడ, సిద్దిపేట–కాచిగూడ రైళ్లు ప్రారంభమయ్యాక వాటిల్లో ప్రయాణికుల సంఖ్య ఏ మేరకు ఉంటోంది? ఏయే ప్రాంతాల్లో ఎక్కువ మంది ఎక్కి దిగుతున్నారు లాంటి అంశాలను పరిశీలించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు కొందరు సిబ్బందిని నియమించారు. వారు ఈ వివరాలు పరిశీలించి సమాచారం ఇచ్చాక తదనుగుణంగా బస్సుల విషయంలో మార్పుచేర్పులు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు