హరర్‌ మూవీలు చూపించి.. అమెరికా అల్లుడి వికృత చేష్టలు

4 Jan, 2023 07:43 IST|Sakshi
ఆందోళన చేస్తున్న బాధితురాలు రామేశ్వరి

సాక్షి, బంజారాహిల్స్‌: ఎన్‌ఆర్‌ఐ భర్త మోసం చేయడంతో బాధిత యువతి ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా మంగళవారం యూసుఫ్‌గూడ ఎల్‌ఎననగర్‌లోని అత్తింటి ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌కు చెందిన మారి మహేష్‌ 2022 మే 26న రామేశ్వరిని వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది జూన్‌ 18న యూఎస్‌ఏలోని టెక్సాస్‌కు తీసుకెళ్లాడు. అయితే ఆ మర్నాటి నుంచే నీ వల్ల కట్నం తక్కువగా వచ్చింది మరొకరిని చేసుకుంటే ఎక్కువ కట్నం వచ్చేదంటూ గొడవ పడుతున్నాడు.

రామేశ్వరిని వదిలించుకోవాలని పలుమార్లు ఆమెపై దాడి చేశాడు. హరర్‌ మూవీలు చూపించేవాడు. బలవంతంగా హుక్కా తాగించేవాడు. ఆ తర్వాత రెండు నెలలకే గత ఆగస్టు 18న రామేశ్వరితో పాటు ఇండియాకు వచ్చిన మహేష్‌ ఆమెను దోమల్‌గూడలోని పుట్టింట్లో వదిలేసి ఆ తెల్లవారే అమెరికా వెళ్లిపోయాడు. ఆమెకు తెలియకుండానే రానుపోనూ టికెట్లు బుక్‌ చేసుకున్నాడు. తనను తీసుకెళ్లాలని ఫోన్‌ చేస్తే టికెట్‌ దొరకడం లేదంటూ బుకాయించాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు గత అక్టోబర్‌ 23న అమెరికాకు టికెట్‌ బుక్‌ చేసి రామేశ్వరిని భర్త వద్దకు పంపించారు.

రామేశ్వరి ఫ్లైట్‌ ఎక్కగానే ఈ విషయమై ఆమె తండ్రి మహేందర్‌ అల్లుడికి ఫోన్‌ చేయగా తనకు ఏం సంబంధం లేదని ఆమె ఎవరో తనకు తెలియదంటూ అసభ్యంగా మాట్లాడి ఫోన్‌ పెట్టేశాడు. ఆమె అమెరికా వెళ్లాక కూడా ఘర్షణ పడటమేగాక విడాకుల నోటీసుపై సంతకం కూడా పెట్టించాడు. ఈ విషయమే రామేశ్వరి తల్లిదండ్రులు మహేష్‌ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ప్రయత్నించగా తమపై దాడి చేయడానికి వచ్చారంటూ మహేష్‌ తల్లిదండ్రులు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో అక్రమ కేసులు బనాయించారు.

పోలీసుల సూచన మేరకు బాధితురాలు ఉమెన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పది రోజులు గడిచినా మహేష్‌ను, ఆమె తల్లిదండ్రులను పోలీసులు పిలవకపోవడంతో రామేశ్వరి తన తల్లిదండ్రులతో కలిసి అత్తమామను కలవడానికి వెళ్లగా ఇంటికి తాళం వేసి బయటికి గెంటేశారు. తన ఇంటికి తనను రావొద్దని చెప్పడానికి వారి ఏం హక్కు ఉందంటూ బాధితురాలు అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని, తక్షణం మహేష్‌ను అమెరికా నుంచి పిలిపించాలని కోరింది.  

(చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..)

మరిన్ని వార్తలు