Huzurabad By Election Bypoll 2021: ప్రభుత్వ ఉద్యోగులూ.. జాగ్రత్త!

2 Oct, 2021 08:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రవీందర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదులొచ్చాయి. రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరపగా నిజమేనని తేలడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు.

అవే ఎన్నికల్లో చొప్పదండి మండలం ఆర్నకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో కుమారస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదులొచ్చాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఆయన సస్పెండ్‌ అయ్యారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులపై ఇలాగే వేటు పడింది. అందుకే ఉద్యోగులూ.. జాగ్రత్త!.

సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్‌ ఉపఎన్నికపై దేశ, రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా వేటుపడటం ఖాయమే. ఎన్నికల నిబంధనల అమలులో ఉన్నతాధికారులు పక్కాగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్నా, మద్దతు తెలిపినా సస్పెన్షన్‌ వేటు పడనుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున అధికారాలు ఎన్నికల సంఘానికి బదిలీ అయ్యాయి.

దీంతో ఉద్యోగులు  అనుచితంగా వ్యవహరిస్తే వేటు వేయడానికి సిద్ధమైంది. ఉద్యోగులు కేవలం తమ విధులకే పరిమితం కావాలి తప్ప ఏ రాజకీయ పక్షానికి వత్తాసు పలకొద్దని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. నిరంతర నిఘాతోపాటు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ పోస్టులపై కూడా ఓ కన్నేశారు. ఎన్నికల్లో నాయకులు ఎలా ప్రచారం చేసుకున్నా, ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఏర్పడే ప్రభావం కన్నా ప్రభుత్వ ఉద్యోగులు చేసే ప్రచారం, వారి వ్యవహార శైలి మాత్రం పెనుచిక్కులు తేనుంది.

సభలు, సమావేశాలు వద్దు
ప్రభుత్వ ఉద్యోగులు తమను ఎవరూ గమనించడం లేదనుకొని ఎవరి సభలోనైనా లేదా సమావేశంలోనైనా పాల్గొంటే చాలు వేటు పడినట్లే. దానికి సంబంధించి వీడియో లేదా ఫొటోలు అధికారులకు అందినా, సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ అయినా జరగాల్సిన నష్టం జరుగుతుంది.  కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక రాజకీయ పక్షానికి సానుకూలంగానో, వ్యతిరేకంగానో ఉంటూ సందర్భం వచ్చినప్పుడు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు.

ఇప్పుడిది పెనుముప్పే. అందుకే రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరు కాకపోవడమే ఉత్తమం. ఇష్టానుసారంగా మాట్లాడటం, పరనింద, ప్రభుత్వ పథకాలపై నిందలు మోపడం వంటి చర్యలకు దిగే ప్రభుత్వ ఉద్యోగులపై కఠినచర్యలు చేపట్టేందుకు ఎన్నికల సంఘం తన నిబంధనలకు మరింత పదును పెడుతోంది. గతంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తూనే అంగన్‌వాడీలపై వేటు వేశారు. గతంలో అంగన్‌వాడీ, ఐకేపీ సిబ్బంది ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఫోన్లు చేసి, మద్దతు కోరినా దయచేసి తమను ఎన్నికల్లోకి లాగొద్దని సూచిస్తున్నారు.  

సెల్‌ఫోన్లతో కష్టాలు..
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో క్షణాల్లో సమాచారం విశ్వవ్యాప్తమవుతోంది. స్మార్ట్‌ఫోన్లు లేనివారు లేకపోగా ఉన్నవారు అధునాతన ఫీచర్లను వినియోగిస్తున్నారు. ఇదే క్రమంలో ఉద్యోగులు సెల్‌ఫోన్‌ ద్వారా విస్తృతంగా వాడుతున్న ఫేస్‌బుక్, వాట్సాప్‌ గ్రూపుల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా పోస్టులు చేసినా చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. తొలుత విధుల నుంచి తొలగించాకే మరో ఆలోచన ఉంటుంది.

ఉద్యోగులు ఎటువైపు?
హుజూరాబాద్‌ ఉపఎన్నిక సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు ఏ పార్టీ వైపు ఉన్నారన్న చర్చ జోరందుకుంది. కొన్ని సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే, మరికొన్ని  ప్రతికూలం అంటున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆశించిన ప్రయోజనాలను కల్పించలేకపోయిందన్న ఆరోపణలున్న నేపథ్యంలో ఉద్యోగుల తీర్పు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సీపీఎస్‌ విధానంపై ఉద్యోగులు సర్కారుపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. పాత పెన్షన్‌ విధానాన్ని ఎవరు అమలుపరిస్తే వారికే తమ మద్దతు ఉంటుందని అంతర్గతంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

చదవండి: సిట్టింగ్‌లకు నో ఛాన్స్‌.. సుమారు 150 మందికి అవకాశం లేదు !

మరిన్ని వార్తలు