దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

9 Nov, 2020 13:01 IST|Sakshi

సాక్షి, దుబ్బాక: కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందని ఉత్కంఠ నెలకొంది. టీవీల ముందుకూర్చున్న నేతలు, ప్రజలు ఎన్నికల కౌంటింగ్ బ్రేకింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లును అధికారులు పూర్తిచేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, సీపీ జోయల్ డేవిస్‌లు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు.   చదవండి:  (దుబ్బాక: అందరూ ఆశల పల్లకీలో!)

10వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాగా, మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఆ తర్వాత 8.30 నుంచి ఈవీఎంలు లెక్కింపు మొదలుకానుంది. ఈ ప్రక్రియలో14 టేబుల్స్ ఏర్పాటు చేసి 14 రౌండ్లలో అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్ట్రాంగ్‌ రూమ్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో రికార్డ్ చేస్తూ లెక్కింపు చేపట్టనున్నారు. సిద్దిపేట జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. పాసులు ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రం ఇందూర్ కాలేజి వరకు అనుమతి ఇస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో 14 టేబుళ్ల మధ్య 6 అడుగల భౌతిక దూరం ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. 

మరిన్ని వార్తలు