బీఎస్సీ డేటా సైన్స్‌ ఈ కోర్సు కిరాక్‌

1 Oct, 2021 03:58 IST|Sakshi

అవగాహన లేకపోవడంతో పట్టించుకోని విద్యార్థులు 

ఇంజనీరింగ్‌లో డిగ్రీ కోసం లక్షల్లో డిమాండ్‌ చేస్తున్న కాలేజీలు 

ఈ కోర్సుతోనూ మెరుగైన ఉపాధి అవకాశాలుంటాయంటున్న ఉన్నత విద్యామండలి 

చదువు ముగిశాక ఓ పరీక్ష రాస్తే సరి

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలి కాలంలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లో డేటా సైన్స్‌ కోసం విద్యార్థులు విపరీతంగా పోటీ పడుతున్నారు. మెరుగైన ఉపాధి కల్పించే కోర్సుగా దీనిని భావిస్తుండటమే ఇందుకు కారణం. తాజాగా చేపట్టిన మొదటి దశ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో 3,229 డేటా సైన్స్‌ సీట్ల భర్తీకి దాదాపు 20 వేల మందికి పైగా ఆప్షన్లు ఇవ్వడం దీని డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది. దీంతో ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు సీటుకు రూ.10 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఇంజనీరింగ్‌ డేటా సైన్స్‌ కన్నా బీఎస్సీ డేటా సైన్స్‌ మెరుగైనదని ఉన్నత విద్యామండలి స్పష్టం చేస్తోంది.

గతేడాదే డిగ్రీలో దీన్ని ప్రవేశపెట్టగా ఈ సంవత్సరం దీనికి మరిన్ని మెరుగులు దిద్దారు. అప్పట్లోనే దాదాపు 7 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ సరైన ప్రచారం లేకపోవడంతో విద్యార్థులు ఈ కోర్సును పట్టించుకోవడం లేదని, ప్రాధాన్యతను గుర్తించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌పై తరగని మోజు కూడా ఇందుకు కారణమవుతోందని అంటున్నారు. రూ.లక్షలు వెచ్చించి ఇంజనీరింగ్‌ చేసే బదులు బీఎస్సీ డేటా సైన్స్‌ చేస్తే మెరుగైన ఉపాధి పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు. 

ఎంఎన్‌సీల ప్రత్యేక శిక్షణ 
ఇంజనీరింగ్‌ డేటా సైన్స్‌ నాలుగేళ్ల కోర్సు అయితే బీఎస్సీ డేటా సైన్స్‌ మూడేళ్ల కోర్సే. ఇంజనీరింగ్‌ విద్య పూర్తి చేసిన తర్వాత విద్యార్థి మార్కెట్‌కు తగినవిధంగా ఇతర అప్లికేషన్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ సాధ్యం కాకపోతే ఈ దిశగా విద్యార్థి కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. బీఎస్సీ డేటా సైన్స్‌ కోర్సులో మొదటి సంవత్సరం నుంచే బహుళజాతి సంస్థల ప్రతినిధులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ మేరకు పలు సంస్థలతో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ సహా మొత్తం 25 కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఆ సంస్థల్లో పనిచేసేందుకు ఎలాంటి శిక్షణ కావాలో ఆ శిక్షణను విద్యార్థి దశ నుంచే ఆయా కంపెనీలు అందిస్తాయి. 

మార్కెట్‌ ట్రెండ్‌ను అనుసరించి మాడ్యూల్స్‌  
మార్కెట్‌ ట్రెండ్‌ను అనుసరించి సరికొత్త మాడ్యూల్స్‌ను కార్పొరేట్‌ కంపెనీలు రూపొందించి బీఎస్సీ డేటా సైన్స్‌ విద్యార్థులకు పంపుతాయి. జావా, పైతాన్‌తో పాటు పలు రకాల 
టూల్స్‌ను ఆయా సంస్థలు నేర్పిస్తాయి. వీటిపై లేబొరేటరీల్లో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహిస్తారు. దీంతో పాటు సంస్థల నేతృత్వంలోనే మూడేళ్ళ పాటు మినీ ప్రాజెక్టులు చేపడతారు. దీంతో బీఎస్సీ డేటా సైన్స్‌ కోర్సు పూర్తయ్యే నాటికే విద్యార్థికి పూర్తి స్థాయి నైపుణ్యం ఉంటుందని ఉన్నత విద్యా మండలి తెలిపింది.  

కంపెనీల అవసరాలకు సరిపడే కోర్సు 
బీఎస్సీ డేటా సైన్స్‌ కోర్సును కంపెనీల అవసరాలకు అనుగుణంగా రూపొందిం చాం. డిగ్రీని చులకన చేసే పరిస్థితులను మార్చాలన్నదే లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులను గుర్తించి, వాటిపై బహుళజాతి కంపెనీలు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తాయి. దీంతో డిగ్రీ పూర్తవ్వడంతోనే మెరుగైన వేతనాలతో విద్యార్థులు స్థిరపడే వీలుంది. 


– లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ 

బీఎస్సీ విద్యార్థుల్లో విశ్వాసం పెరిగింది 
గతంతో పోలిస్తే బీఎస్సీ డేటా సైన్స్‌ విద్యార్థుల్లో విశ్వాసం పెరిగింది. తొలిదశ నుంచే పైతాన్, జావాతో పాటు అనేక కొత్త అప్లికేషన్లపై అవగాహన పెంచుకుంటున్నారు. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులతో ఏమాత్రం తీసిపోని రీతిలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకుంటున్నారు. 
– ప్రొఫెసర్‌ శ్యామల, కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకురాలు, ఓయూ  

క్యాంపస్‌ నియామకాల్లో వీళ్లకే చోటు
బీఎస్సీ డేటా సైన్స్‌ విద్యార్థులను కన్సార్షియం సంస్థలు పూర్తిగా తాము తయారు చేసుకున్న మానవ వనరులుగానే భావిస్తాయి. ఉమ్మడి ప్రణాళికతో తమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక శిక్షణ ఇవ్వడం వల్ల ఉమ్మడిగా జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఒక్క పరీక్షలో ర్యాంకు సాధిస్తే 25 కంపెనీల్లో ఇతర పరీక్షలు లేకుండా ఉపాధి పొందే వీలుంది.

డిగ్రీ విద్యార్థులు స్థిరంగా ఒకే కంపెనీలో ఎక్కువ కాలం ఉండే వీలుందని ఇటీవలి విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని పరిగణనలోనికి తీసుకుని క్యాంపస్‌ నియామకాల్లో ఇంజనీరింగ్‌ డేటా సైన్స్‌ కన్నా, బీఎస్సీ డేటా సైన్స్‌ పూర్తి చేసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీల ప్రతినిధులు భావిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు