పోడు వివాదానికి ఇక తెర! 

13 Oct, 2021 01:43 IST|Sakshi

2005కు ముందు సాగులో ఉన్నవారే లెక్కలోకి.. 

మూడు తరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనేతరులు 

దసరా తర్వాత రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ 

ప్రాథమిక నివేదిక సీఎంకు అందజేత!

సాక్షి, మహబూబాబాద్‌: దశాబ్దాల తరబడి పోడు రైతులకు, అటవీ అధికారులకు మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడనుంది. అయితే భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్న రైతులు భూమిని విడిచి పెట్టేందుకు సిద్ధంగా లేకపోగా, ఫారెస్టు భూమిని సైతం తగ్గించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. ఇందులో మధ్యేమార్గంగా వేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్‌పర్సన్, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఉపసంఘం మూడుసార్లు సమావేశమైంది. అయితే సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోలేదని చెబుతూనే.. ఇప్పటికే ప్రాథమిక నివేదికను తయారు చేసి సీఎం కేసీఆర్‌కు అందజేసినట్లు సమాచారం.  

2005కు ముందున్నవారికే ప్రాధాన్యం! 
రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో 2005కు ముందు నుంచి సాగులో ఉన్నవారికే హక్కుపత్రాలు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. అందుకు ఆధారాలుగా గిరిజన ప్రాంతంలోని రేషన్‌కార్డు, ఓటరు ఐడీ, లేదా ఫారెస్టు, పోలీసు కేసు రికార్డులు ఉంటే సరిపోతుందనే నిబంధనలు పెట్టారు. గిరిజనేతరులైతే మూడు తరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటూ భూమిని సాగు చేసుకున్నవారు అర్హులు.

ఇందుకోసం 25 ఏళ్లకు ఒక తరం చొప్పున 75 ఏళ్లు, 2005 నుంచి ఇప్పటివరకు 16 ఏళ్లు.. ఇలా మొత్తం 91 ఏళ్లుగా గిరిజనేతరులు సాగులో ఉండాల్సి ఉంటుంది. అయితే గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో ఎలా ఉన్నారనే విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు రామప్ప దేవాలయం ఎనిమిది శతాబ్దాల క్రితం నిర్మించారు. అప్పటికే అక్కడే బ్రాహ్మణులు, ఇతర కులాలవారు వ్యవసాయం చేసుకుంటూ జీవించారనే చారిత్రక ఆధారాలు ఉన్నట్లు చర్చ జరిగింది. ఇలా గిరిజనేతరులకు కూడా పట్టాలు ఇవ్వాల్సిన ఆవశ్యకతను కమిటీ చర్చించింది.  

గొత్తికోయలు మనోళ్లు కాదు.. 
పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాల్సి వస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గొత్తికోయలకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధానంగా ములుగు, మహబూబాబాద్‌తోపాటు ఖమ్మం జిల్లా చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం మండలాలు, భూపాలపల్లి జిల్లాలోని వాజేడు ప్రాంతంలో గొత్తికోయలు ఉంటున్నారు. వీరు సంచార జీవనంగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల నుంచి వచ్చినవారే కానీ, స్థానికులు కాదనే అభిప్రాయానికి వచ్చారు. 

 ఒక్కొక్కరికి నాలుగు హెక్టార్ల వరకే పట్టాలు..  
అటవీశాఖ భూములే కదా.. అని గిరిజనులు, గిరిజనేతరులు వందల ఎకరాలు ఆక్రమించుకున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అయితే ఒక్కొక్కరికి 4 హెక్టార్లు(పది ఎకరాలు) భూమికి మాత్రమే పట్టాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకోనుంది. మిగిలిన భూమిని ఫారెస్టులో కలుపుకోవాలని భావిస్తోంది.  

పండుగ తర్వాతే.. 
పోడు భూముల పట్టాలు అందించేందుకు అర్హులైన రైతులను ఎంపిక చేసే ప్రక్రియ దసరా తర్వాత ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా తయారు చేసి దరఖాస్తులను ఏజెన్సీ ప్రాంతాల్లోని రైతులకు అందుబాటులో ఉంచుతారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ముందుగా గ్రామపంచాయతీ, మండలస్థాయిలో, రెండో దశలో రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో, కలెక్టర్, భూ పరిపాలనా విభాగం, ఫారెస్టు, ఐటీడీఏ పీవో స్థాయి అధికారులు పరిశీలించి తుది జాబితా రూపొందిస్తారు. 

నిజమైన రైతులకు న్యాయం.. 
భూమినే నమ్ముకొని జీవిస్తున్న నిజమైన రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం తీసుకునే నిర్ణయాలు వారికి అనుకూలంగా ఉంటాయి. ఎన్ని ఎకరాలు ఇవ్వాలి.. ఎప్పటి నుంచి భూమిని సాగు చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వాలి.. అనేవి కీలకాంశాలుగా చర్చ జరుగుతోంది.  
– సత్యవతి రాథోడ్, రాష్ట్ర మంత్రి, ఉపసంఘం చైర్‌పర్సన్‌

శాశ్వత పరిష్కారం చూపాలి 
ఏజెన్సీ మండలాల్లో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి. 2005 కంటే ముందు సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు, రైతుబీమా, సాగునీరు అందించినట్లయితే ఉన్న అడవులను స్థానికులే కాపాడుకుంటారు.
– సీతక్క, ములుగు ఎమ్మెల్యే  

స్వేచ్ఛగా సాగు చేసుకోనివ్వాలి.. 
ఏజెన్సీ గ్రామాల్లోని పోడు భూముల్లో స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునే విధంగా చూడాలి. అర్హులైన ప్రతి వ్యక్తికి పట్టాలు ఇచ్చి రెండు పంటలకు నీరందించాలి. అప్పుడే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుంది. 
– ఆగబోయిన రవి, తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు   

మరిన్ని వార్తలు