హైదరాబాద్‌: వినాయక విగ్రహాల నిమజ్జనం ఎక్కడ?

13 Sep, 2021 14:58 IST|Sakshi

‘సాగర్‌’లో వద్దంటూ శనివారం నోటీసులు

జారీని ఆదివారం ఆపేసిన పోలీసులు

నేడు రివ్యూ పిటిషన్‌ వేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనం ఎక్కడ అనే అంశంపై గందరగోళం నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్‌సాగర్‌లో వద్దంటూ మండప నిర్వాహకులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు హఠాత్తుగా ఆ ప్రక్రియను ఆపేశారు. మరోపక్క ఈ అంశంపై హైకోర్టులో ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింహైకోర్టు తమ తీర్పును పునః పరిశీలించాలని జీహెచ్‌ఎంసీ కోరింది.. 

► వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనం ఏళ్లుగా హుస్సేన్‌సాగర్‌లో నిర్వహిస్తున్నారు. ఆ రోజు నగరంతో పాటు చుట్టు పక్కల కమిషనరేట్లు, జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విగ్రహాలు వస్తాయి. పోలీసు శాఖ గత వారం ట్రయల్‌ రన్‌ సైతం నిర్వహించింది.

►నేపథ్యంలో హుసేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారైన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పునరాలోచనలో పడ్డ పోలీసు విభాగం శనివారం రాత్రి 11 గంటలకు అన్ని పోలీసుస్టేషన్లకు దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. 

► హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో పోలీసుస్టేషన్లకు చెందిన సిబ్బంది తక్షణం రంగంలోకి దిగారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడానికి వీలులేదంటూ నోటీసులు రూపొందించింది. వీటికి హైకోర్టు ఆదేశాల కాపీలను జత చేస్తూ మండపాల నిర్వాహకులు జారీ చేయడం ప్రారంభించింది. 

►  శనివారం రాత్రి కొన్ని మండపాల నిర్వాహకులకు అందించారు. అయితే ఆదివారం ఉదయం నోటీసుల జారీ ఆపాలంటూ  ఆదేశాలు వచ్చాయి.  

► హైకోర్టు ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్‌ వేయాలంటూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నోటీసులు జారీ ఆపేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆదివారం వరకు అవసరమైన సంఖ్యలో క్రేన్లను కూడా ఏర్పాటు చేయలేదు. 

► గణేష్‌ నవరాత్రుల్లో మూడో రోజు నిమజ్జనాలు ప్రారంభమవుతాయి. ఆదివారం కొన్ని విగ్రహాలను నెక్లెస్‌ రోడ్‌లో ఉన్న బేబీ పాండ్‌లో చేపట్టారు. సోమవారం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసు విభాగం నిర్ణయించింది. ఈలోపు ప్రత్యామ్నాయంగా అవకాశం ఉన్న చెరువుల జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు